వాట్సాప్‌లో మెసేజ్‌.. అన్నా.. నేను చనిపోతున్నా..! 

24 Jun, 2022 21:11 IST|Sakshi
అశోక్‌రెడ్డి (ఫైల్‌)

పెద్దారవీడు(ప్రకాశం జిల్లా): ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్‌ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్‌ పైనుంచి దూకి అర్ధంతరంగా తనువు చాలించాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పుట్టెడు శోకం మిగిల్చిన ఈ విషాద సంఘటన పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వజ్రాల అశోక్‌రెడ్డి(17) మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ గ్రూప్‌ ద్వితీయ సంవత్సరం చదివాడు.
చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని..

పరీక్షలు రాసిన తర్వాత నంద్యాల పట్టణంలో ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాల్లో అశోక్‌రెడ్డి ఉత్తీర్ణుడు కాలేదు. గురువారం నంద్యాల నుంచి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులు, అన్న, అక్కతో గడిపాడు. అన్న ఆదినారాయణరెడ్డి ట్రాక్టర్‌ తీసుకుని పొలం పనులకు వెళ్లాడు.

ఇంతలోనే అశోక్‌రెడ్డి గ్రామానికి సమీపంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్‌ పైకి ఎక్కి తన అన్నతో పాటు జమనపల్లె గ్రామంలోని స్నేహితులకు ‘నేను చనిపోతున్నా’ అని వాట్సాప్‌లో మెసేజ్‌ పంపించాడు. తన సోదరుడు వచ్చేలోపు అశోక్‌రెడ్డి డ్యామ్‌ పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్యామ్‌ లోతు దాదాపు 400 అడుగులు ఉంటుందని స్థానికులు తెలిపారు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటరెడ్డి, రమణమ్మ గుండెలవిసేలా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

మరిన్ని వార్తలు