విషాదం: పబ్జీ గేమ్‌ ఆడిన యువకుడు..

11 Aug, 2020 09:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ద్వారకాతిరుమల: పబ్జీ గేమ్‌కు బానిసైన ఒక యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు కొంత కాలంగా పబ్జీ (ఫ్రీ ఫైర్‌)గేమ్‌కు బానిసయ్యాడు. లాక్‌డౌన్‌ వల్ల ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఈ యువకుడు ఇంటి వద్దే ఖాళీగా ఉంటూ, ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతున్నాడు. నిద్రాహారాలు మానేసి రాత్రి, పగలు అనే తేడాలేకుండా పబ్జీ గేమ్‌ను ఆడేవాడు. నాలుగు రోజుల నుంచి అతడి ఆరోగ్యం దెబ్బతింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం ఉదయం ఆ యువకుడ్ని ఏలూరుకు తీసుకెళ్లి, సంజీవని వాహనంలో కరోనా టెస్ట్‌ చేయించగా, నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.     

దిండి రిసార్ట్స్‌ వద్ద తేలిన మృతదేహం 
పాలకొల్లు సెంట్రల్‌: ఆచంట మండలం భీమలాపురానికి చెందిన యర్రగొండ్ల పవన్‌కుమార్‌ శర్మ(24) గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలలో సోమవారం సాయంత్రం 6గంటలకు దిండి రిసార్ట్స్‌ వద్ద అతని మృతదేహం దొరికినట్లు యలమంచిలి ఎస్సై గంగాధర్‌ తెలిపారు. శర్మ మృతదేహాన్నీ పంచనామా నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి తరలించనున్నట్లు తెలిపారు. పాలకొల్లు గాయత్రి స్మార్త పురోహిత సంఘం సెక్రటరీ ఈరంకి కాశీ విశ్వనాథం తెలిపిన వివరాలు ప్రకారం భీమలాపురానికి చెందిన పవన్‌కుమార్‌ శర్మ సంస్కృతంలో ఎంఏ చేశారు. సంస్కృతానికి విలువ లేకపోవడంతో ఉద్యోగం దొరకక పాలకొల్లు పట్టణంలో పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇతనికి వృద్ధుడైన తండ్రి, మానసిక ఇబ్బందితో ఉన్న తల్లి, కదలలేని స్థితిలో బాబాయ్, 90 సంవత్సరాల నానమ్మ ఉన్నారు. వీరు ఉంటున్న ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది. వీరందరినీ శర్మ జీవనాధారంతోనే పోషించుకుంటూ వస్తున్నాడు. గత నాలుగు నెలలుగా కోవిడ్‌ 19 వల్ల ఆలయాలు మూసివేయడం పెళ్లిళ్లు పేరంటాలు, పూజలు, హోమాలు లేకపోవడంతో ఆదాయ మార్గాలు లేక ఆర్థిక భారంతో అనేక ఇబ్బందులకు గురయ్యాడని తెలిపారు. ఈ బాధలు భరించలేక ఆదివారం తన ద్విచక్ర వాహనంపై చించినాడ గోదావరి వంతెన వద్దకు వెళ్లి గోదావరిలో దూకినట్లు అక్కడి స్థానికులు తెలిపారన్నారు.  

మరిన్ని వార్తలు