బావ వరసయ్యే వ్యక్తితో ప్రేమ.. గర్భం దాల్చిన ఇంటర్‌ విద్యార్థిని

30 Mar, 2022 15:07 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగింపు

సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్‌): పొన్నాడ కేజీబీవీలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. ఈ విషయం బయట పడటంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థినిది ఎచ్చెర్ల మండలం పొన్నాడ సరిహద్దు ధర్మవరం గ్రామం. ఈమె గర్భిణి అనే విషయం గోప్యంగా పాఠశాల యాజమాన్యం ఉంచింది. అయితే ప్రిన్సిపాల్‌ శిరీషకు పడనివారు విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ప్రాధమికంగా విధుల నుంచి తొలగిస్తూ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై అధికారులు మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు.

చదవండి: (విషాదం: అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలకు..)

ఈ మధ్య కరోనా సెలవుల్లో విద్యార్థిని ఇంటికి వెళ్లడంతోపాటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో విద్యార్థిని గ్రామానికి చెందిన బావ వరసయ్యే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. యువతిపై లైంగిక వేధింపుల విషయాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ.. ఆమె గర్భిణిగా తేలడం పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా సిబ్బంది గమనించి స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా ప్రిన్సిపాల్‌ జాప్యం చేసినప్పటికీ ఫిర్యాదు రూపంలో విషయం బయట పడింది. విద్యార్థిని తండ్రి మృతి చెందగా, తల్లి వలస కూలీగా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఎచ్చెర్ల ఎస్సై రాము వద్ద ప్రస్తావించగా.. పోలీస్‌స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు.   

మరిన్ని వార్తలు