కళాశాల హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

18 Apr, 2021 04:33 IST|Sakshi
పవన్‌కల్యాణ్‌ రెడ్డి (ఫైల్‌)

ఒంగోలు: ఇంటర్‌ విద్యార్థి కళాశాల హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. కొనకనమిట్ల మండలం రేగలగడ్డకు చెందిన దుంపా అంజిరెడ్డి, ఆదిలక్ష్మమ్మ దంపతుల కుమారుడు దుంపా పవన్‌కల్యాణ్‌ రెడ్డి (19) ఒంగోలు సమీపంలోని పెళ్లూరులోని శ్రీ సరస్వతి జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామానికి దూరం కావడంతో కాలేజీ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. శనివారం నిద్రలేచిన సహచర విద్యార్థులకు హాస్టల్‌ కిచెన్‌ రూంలో పవన్‌కల్యాణ్‌ రెడ్డి ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు.

విషయాన్ని విద్యార్థులు వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లగా అతడు ఇతర సిబ్బందితో కలిసి పవన్‌ను కిందకు దించి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు రిమ్స్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, చదవలేకే పవన్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని కళాశాల యాజమాన్యం చెబుతోంది. మృతుడి కుటుంబసభ్యులు మాత్రం గతంలో జరిగిన పరీక్షల్లో ఫెయిలయ్యాడని అధ్యాపకులు పవన్‌ను బాగా కొట్టారని, అంతే కాకుండా శుక్రవారం జరిగిన పరీక్షల్లో స్లిప్పులు పెట్టి కాపీ రాస్తూ పట్టుబడటంతో బాగా కొట్టారని చెబుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు