టీడీపీ నేత వేధింపులు.. ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

7 Oct, 2022 05:11 IST|Sakshi
సంధ్యారాణి (ఫైల్‌ ఫొటో), టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనితతో నిందితుడు ఇంతియాజ్‌

ప్రేమించాలంటూ బాలికను వేధిస్తున్న తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి 

ఒప్పుకోకపోవడంతో బాలిక తల్లిదండ్రుల ముందే బెదిరింపులు

ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫేస్‌ బుక్‌లో పెడతానని హెచ్చరిక

భయపడిపోయి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న సంధ్యారాణి

తన మరణానికి ఇంతియాజ్‌ వేధింపులే కారణమంటూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

నిందితుడు.. కదిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంట అనుచరుడు

సాక్షి, అమరావతి/తనకల్లు: టీడీపీ నేత వేధింపులకు ఓ బాలిక బలైపోయింది. ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది.

శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్‌.. ఫేస్‌బుక్‌లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు.

ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది.

ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన ఆత్యహత్యకు రాళ్లపల్లి ఇంతియాజే కారణమంటూ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో చెప్పింది. సమచారం అందుకున్ని స్థానిక ఎస్‌ఐ రాంభూపాల్‌ ఘటన స్థలానికి చేరుకుని సంధ్యారాణి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. 

 కీచక టీడీపీ నేతల అరాచకాలకు చంద్రబాబే కారణం : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌
లైంగిక వేధింపులకు పాల్పడి మైనర్‌ బాలికలను పొట్టనబెట్టుకుంటున్న కీచక టీడీపీ నేతలకు చంద్రబాబు వత్తాసుపలకడం అత్యంత బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఇంతియాజ్‌ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బాలిక ఉదంతంపై గురువారం వాసిరెడ్డి పద్మ.. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ, కదిరి డీఎస్పీతో మాట్లాడారు.

కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలకు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అనంత, సత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు ప్రధాన కారణం.. వారిని చంద్రబాబు వెనుకేసుకురావడమేనన్నారు. విజయవాడలో వినోద్‌ జైన్‌ కేసు, లోకేశ్‌ పీఏ వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే.. ఇలాంటి ఘటనలకు తావుండేది కాదన్నారు. 

మరిన్ని వార్తలు