గొంతుకు చున్నీ బిగించి..

15 Feb, 2022 02:15 IST|Sakshi

ఇంటర్‌ విద్యార్థిని హత్య 

మామిడి తోటలో మృతదేహం

సంగారెడ్డి జిల్లాలో ఘటన

జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థిని హత్యకు గురైంది. జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి దగ్గర్లో మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం ఓ బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గొంతుకు చున్నీ బిగించి బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హుగ్గెల్లికి చెందిన బుజ్జమ్మ భర్త 15 ఏళ్ల కిందట చనిపోయాడు.

దీంతో కూలీ పనులు చేస్తూ కొడుకు సురేశ్, కుమార్తె మౌనిక (16)ను పోషిస్తోంది. మౌనిక జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లి డ్వాక్రా గ్రూపు సమావేశానికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి చేరింది. కుమార్తె మరో గదిలో పడుకొని ఉంటుందని తల్లి భావించి నిద్రపోయింది. ఉదయం కుమార్తె కనిపించకపోవడంతో గ్రామంలో విచారించింది. మధ్యాహ్నం గ్రామ శివారులో మృతదేహం ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసి అది మౌనిక మృతదేహమేనని బోరున విలపించింది.

సర్పంచ్‌ రాజు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శంకర్‌రాజు, సీఐ రాజశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్‌ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు