అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్‌ బాషా భాయ్‌ అరెస్ట్‌

10 Nov, 2020 03:56 IST|Sakshi
నిందితులు, ఎర్రచందనం దుంగలతో ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు

మరో 11 మంది నిందితులు కూడా

1.300 టన్నుల ఎర్రచందనం దుంగలు, లారీ, కారు, మూడు మోటార్‌ సైకిళ్లు స్వాధీనం 

వివరాలు వెల్లడించిన వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

కడప అర్బన్‌: మోస్ట్‌ వాంటెడ్‌ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ షేక్‌ అబ్దుల్‌ హకీం అలియాస్‌ బాషా భాయ్‌ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఖాసీం, ఓఎస్‌డీ (ఆపరేషన్స్‌) దేవప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది.. బాషాతోపాటు మరో 11 మందిని సోమవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. వివరాలను ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు వెల్లడించారు. బాషా భాయ్‌తో పాటు కడపకు చెందిన జయరాం నాయక్, వెంకట మహేశ్వరరాజు, గిరీశ్‌కుమార్, తిప్పిరెడ్డిపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్, తూర్పుగల్లూరు కాలనీకి చెందిన నవీన్‌కుమార్, బీడీ కాలనీకి చెందిన రవికాంత్, పెద్దచెప్పలికి చెందిన పెయ్యల చిరంజీవి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కడపలో పట్టుబడ్డారు. అలాగే రైల్వేకోడూరులో వీరరాఘవ సెట్టియార్, రామన్‌ అశోక్, మణిమాధవన్‌లు స్మగ్లింగ్‌ చేస్తూ అరెస్టయ్యారు. ఈ 12 మంది నుంచి 1.300 టన్నుల బరువున్న 34 ఎర్రచందనం దుంగలను, లారీ, కారు, మూడు మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

దర్యాప్తులో బయటికి..
ఈ నెల 2న కడప– కమలాపురం రహదారిపై స్కార్పియో వాహనం.. టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం నరికి అప్పగించడానికి తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది కూలీలతో బాషా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలు ఎర్రచందనం దుంగలతో ఈ నెల 2న స్కార్పియోలో బయలుదేరారు. అయితే వారికి ఇస్తానన్న మొత్తం ఎగ్గొట్టాలని బాషా నిర్ణయించుకున్నాడు. వీరిని అటకాయించి దుంగలు తీసుకురావాలని తన అనుచరులను కారులో పంపాడు. ఆ కారును చూసిన తమిళ కూలీలు పోలీసులు అనుకుని భయపడ్డారు. దీంతో వాహనాన్ని వేగంగా పోనిస్తూ టిప్పర్‌ను ఢీకొట్టి ఐదుగురు మృతి చెందారు. 

ఎవరీ భాషా?
పోలీసులు తమ దర్యాప్తులో బాషా భాయ్‌ని ఘటనకు బాధ్యుడిగా తేల్చారు. ఇతడిపై వివిధ జిల్లాల్లో 26 కేసులు ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బాషా భాయ్‌ కడపలోని బంధువుల వద్దకు వచ్చిపోతూ ఉండేవాడు. అనేక వ్యాపారాలు చేసిన అతడు గుప్తనిధుల కోసం ప్రయత్నాలు చేశాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎంచుకున్నాడు. గతంలో 9 నెలలు కడప, చిత్తూరు జైళ్లలో గడిపాడు. విడుదలయ్యాక కోయంబత్తూరులో బట్టల వ్యాపారం ముసుగులో మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్‌ మొదలుపెట్టాడు. 

మరిన్ని వార్తలు