వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే..

18 Feb, 2023 09:27 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లాలో ఓ వ్యక్తి  బ్యాంకు ఖాతా­లోని రూ.90 వేలు ఎవరో విత్‌డ్రా చేశారని పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై కడప పోలీసులు విచారణ చేపట్టగా.. ఉత్తర­ప్రదేశ్‌ కేంద్రంగా దందా సాగిస్తున్న అంతర్‌­రాష్ట్ర సైబర్‌ నేరస్తుల ముఠా గుట్టు రట్టయింది. ‘ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టం (ఏఈపీఎస్‌) ద్వారా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న దందా బట్టబయలైంది. కడప పోలీసులు ఈ కేసును విజయవంతంగా ఛేదించి సైబర్‌ నేరస్తులను అరెస్టు చేశారు.

విశాఖపట్నంలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.1.50 లక్షలు గల్లంతయ్యాయి. దీనిపై విచారించగా హరియాణలోని ఓ ముఠా దందా వెలుగుచూసింది. ఆన్‌లైన్‌లో రుణాలు ఇస్తామని చెప్పి ఓ సంస్థ ఆయన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు కాపీలతోపాటు వేలిముద్రలు కూడా తీసుకుంది. అనంతరం క్లోనింగ్‌ ద్వారా ఆయన బ్యాంకు ఖాతాల్లోని నగదును విత్‌డ్రా చేసేసింది.

­సాక్షి, అమరావతి: దేశంలో కొత్తరూపు సంతరించుకుంటున్న సైబర్‌ నేరాలకు తాజా ఉదాహరణలు ఇవి. ఏఈపీఎస్‌ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు చెలరేగి­పోతున్నారు. బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్‌ ద్వారా వారి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ తరహా సైబర్‌ నేరాలు అధికమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ ప్రకారం గత ఆరునెలల్లో దాదాపు నాలుగు­వేల కేసులు నమోదవడం ఈ తరహా సైబర్‌ నేరాల తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ రీతిలో సైబర్‌ నేరాలకు పాల్ప­డుతున్న ముఠాలు అత్యధికంగా హరియాణలో కేంద్రీకృతం కాగా.. మరికొన్ని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి దందా సాగిస్తున్నాయని సైబర్‌ పోలీసుల విభాగం గుర్తించింది.

సైబర్‌ మోసం ఇలా..
సైబర్‌ నేరగాళ్లు ఏఈపీఎస్‌ను దుర్వినియోగం చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదును కొట్టేస్తున్నారు. అందుకోసం రెండుమూడు తరహాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా వివిధ వెబ్‌సైట్ల నుంచి వ్యక్తుల వేలిముద్రలను ‘బటర్‌ పేపర్‌’పై కాపీచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ, ట్రెజరీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లు, ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదైన వేలిముద్రలను కాపీచేస్తారు. అనంతరం క్లోనింగ్‌ ద్వారా నకిలీ సిలికాన్‌/రబ్బర్‌ వేలిముద్రలు తయారు చేస్తారు. ఆధార్‌ నంబరు అనుసంధానమైన వ్యక్తుల పేరిట ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. దీంతో ఆ వ్యక్తుల అసలైన ఆన్‌లైన్‌ ఖాతాలు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్‌లు వారి నియంత్రణలోకి వస్తాయి.

అనంతరం తాము క్లోనింగ్‌  చేసిన వేలిముద్రలు ఉపయోగించి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మరికొన్నిసార్లు బ్యాంక్‌ బిజినెస్‌ కరస్పాండెంట్స్, ఏజెంట్స్‌ కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌లో బయోమెట్రిక్‌ డివైజ్‌ స్కానర్స్‌తో స్కాన్‌చేసి నగదు లాగేస్తున్నారు. మరికొన్ని ముఠాలు ఏకంగా ఆన్‌లైన్‌ రుణ కంపెనీల పేరిట నకిలీ సంస్థలను ప్రారంభిస్తున్నాయి. రుణాలు ఇస్తామని ఆన్‌లైన్‌లో ప్రకటనలు చేస్తున్నాయి.

రుణాల కోసం తమను సంప్రదించే వ్యక్తుల పాన్‌కార్డులు, ఆధార్‌కార్డుల కాపీలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నాయి. అనంతరం క్లోనింగ్‌ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును తస్కరిస్తున్నాయి.  ఆధార్‌ నంబర్లతో లింక్‌ అయిన బ్యాంకు ఖాతాల్లోని నగదును పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషిన్ల ద్వారా కూడా సిఫోనింగ్‌ చేసి మరీ ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఇలా పలు రకాలుగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు.

అప్రమత్తతే  శ్రీరామరక్ష
బ్యాంకు ఖాతాదారులు అప్రమ­త్తంగా ఉండాలని సైబర్‌ పోలీ­సులు సూచిస్తున్నారు. అందుకు ఖాతా­దారులతోపాటు ప్రభు­త్వ ­సంç­Ü్థల­­కు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ వెబ్‌సైట్లను ఎవరూ హ్యాక్‌ చే­య­కుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

తమ వెబ్‌సైట్లను తరచు సేఫ్టీ ఆడిట్‌ చేయాలి. 

ప్రజల వ్యక్తిగత సమాచారం లీక్‌­కా­కుండా తగిన ప్రమాణాలు పాటించాలి.

అందుకోసం కేంద్రీకృత కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

ఖాతాదారులకు సూచనలు
ఏఈపీఎస్‌ విధానాన్ని తరచు విని­యోగించని ఖాతాదారులు ఆ సౌల­భ్యాన్ని ఉపసంహరించుకో­వాలి. వెబ్‌­సైట్లలో తమ వేలిము­ద్రలు న­మో­దు చేయకూడదు. ఎటువంటి వ్యవ­హారం కోసమైనా సరే వేలి­ముద్రలు అడిగితే తిరస్క­రించాలి.

తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు­లు మాయమయ్యాయని గుర్తిస్తే 24 గంటల్లోనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీంతో వారి ఖాతానుంచి నగదు బదిలీ అయిన ఖాతాను సైబర్‌ పోలీసులు స్తంభింపజేయడా­నికి అవకాశం ఉంటుంది. సైబర్‌ నేరం జరిగినట్టు తెలియ­గానే ఏపీ సైబర్‌మిత్ర (వాట్సాప్‌ నంబర్‌ 9121211100)నుగానీ, నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌ (1930)ను గానీ సంప్రదించి ఫిర్యాదు చేయాలి.
చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది..  

మరిన్ని వార్తలు