అంతర్‌రాష్ట్ర సైబర్‌ నేరగాళ్ల ముఠా ఆటకట్టు

17 Feb, 2022 04:18 IST|Sakshi
సైబర్‌నేరగాళ్ల అరెస్ట్‌ వివరాలను తెలియజేస్తున్న జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) ఎం.దేవప్రసాద్‌

వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు బస్టాండ్‌లో అరెస్టు

నిందితులు తెలంగాణకు చెందిన వారు

పరారీలో మరో నిందితుడు

కడప అర్బన్‌: ఆన్‌లైన్‌ ద్వారా అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర సైబర్‌ నేరగాళ్లను కడప పోలీసులు మంగళవారం రాత్రి మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) ఎం.దేవప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. కడప జిల్లాలోని మైదుకూరు సబ్‌డివిజన్‌ పరిధిలోని బ్రహ్మంగారిమఠం మండలం ఎన్‌.గొల్లపల్లికి చెందిన దేవరకొండ జగదీశ్వరి అనే మహిళకు 2021 జనవరి 11న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఆమె తండ్రి తనకు బాగా తెలుసునని నమ్మబలికాడు. తాను బి.మఠం ఏఎస్‌ఐ అని, తమ బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని.. రూ.40 వేల సర్దితే..గంటలోనే  కానిస్టేబుల్‌ ద్వారా తిరిగి డబ్బు పంపిస్తానని మాయమాటలు చెప్పాడు.

ఆయన మాటలు నమ్మిన జగదీశ్వరి ఫోన్‌పే ద్వారా రూ.40,000 పంపింది. డబ్బు పడ్డ వెంటనే ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నాడు. దీంతో జగదీశ్వరి తన తండ్రి దేవరకొండ క్రిష్ణయ్యకు విషయం చెప్పింది. ఆయన ఫిర్యాదు మేరకు బి.మఠం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో మరికొంతమందితో కలసి దువ్వూరులో రూ.70 వేలు, ఎర్రగుంట్ల పీఎస్‌ పరిధిలో రూ.40 వేలు, చిట్వేలిలో రూ.19 వేలు అమాయకుల నుంచి కాజేశారు.

ఆయా కేసుల దర్యాప్తులో.. తెలంగాణా రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ పరిధిలోని భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన దువ్వాసి భరత్‌ను.. సూర్యాపేట్‌ జిల్లా మోతే మండలం, లాలు తాండకు చెందిన కీలుకాని సాయిచంద్‌గా గుర్తించారు.  మంగళవారం రాత్రి వీరు మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఉండగా..పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పీడీ యాక్ట్‌ ఉన్న హైదరాబాద్‌కు చెందిన శరత్‌రెడ్డి కూడా ఈ కేసుల్లో నిందితుడిని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామని అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) ఎం.దేవప్రసాద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు