గన్‌తో బెదిరించి దోపిడీలు.. వాళ్ల టార్గెట్‌ తెలిస్తే ఆశ్చ ర్యపోతారు!

23 Feb, 2022 16:13 IST|Sakshi

అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు 

రూ.44.77 లక్షల సొత్తు స్వాధీనం 

నాగోలు: టైర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్‌ చేసి.. తుపాకితో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పహడీషరీఫ్‌ పోలీసులు, ఎల్‌బీనగర్‌ సీసీఎస్, ఐటీ సెల్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44,77,760 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్‌బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం..హర్యానా రాష్ట్రం, మేనాత్‌ జిల్లాకు  చెందిన జంషీద్‌ ఖాన్, రహెల్‌ ఖాన్, ఆజాద్‌లు ముఠాగా ఏర్పడ్డారు.

లోడ్‌ చేసిన కంటైనర్‌లతో వెళ్లే లారీలను దోచుకోవాలని పథకం వేశారు. జనవరి 18న అపోలో లారీ టైర్లు (220) దోచుకున్నారు. లిఫ్ట్‌ అడిగి..లారీలోకి ఎక్కి గన్‌తో బెదిరించి..డ్రైవర్, క్లీనర్‌ను కట్టివేసి టైర్లు చోరీ చేశారు. ఈ నెల 15వ తేదీన తమిళనాడు నుంచి బయలుదేరిన కంటైనర్‌ నుంచి మరో కంపెనీ టైర్లను ఇదే పద్ధతిలో చోచుకున్నారు. లిఫ్ట్‌ అడిగి కంటైనర్‌ ఎక్కిన వీరు...ఈ నెల 17న నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలోకి కంటైనర్‌ రాగానే జంషీద్‌ ఖాన్, రహీల్‌ ఖాన్‌లు క్లీనర్‌ను గన్‌తో బెదిరించి కంటైనర్‌ను రోడ్డు పక్కన ఆపి, డ్రైవర్, క్లీనర్‌లను తాడుతో కట్టి క్యాబిన్‌లో పడివేశారు.

హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ బాసిత్‌ హుస్సేన్, అఫ్రోజ్‌ ఆలీ ఖాన్‌ల సాయంతో కాటేదాన్‌లో ఉన్న కమల్‌ కబ్రా టైర్ల గోదాములో దోచుకున్న టైర్లను తక్కువ ధరకు అమ్మివేసి తుక్కుగూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కంటైనర్‌ వదిలేసి పారిపోయారు. కంటైనర్‌ రోడ్డుపై ఎక్కవ సేపు ఆగి ఉండడంతో స్థానికులు గమనించి లారీ క్యాబిన్‌లో కట్టిపడేసి ఉన్న డ్రైవర్, క్లీనర్‌లను రక్షించారు. లారీ డ్రైవర్‌ పహడీషరీష్‌ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల ఆటకట్టించారు.

జంషీద్‌ ఖాన్‌ ఇటీవల ఢిల్లీకి విమానంలో వెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకుని అక్కడి పోలీస్‌లకు సమాచారం ఇచ్చి, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. చోరీకి సహకరించిన సయ్యద్‌ బాసిత్‌ హుస్సేన్, అఫ్రోజ్‌ అలీఖాన్, టైర్లు కొనుగోలు చేసిన కమల్‌ కబ్రాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 152 టైర్లు, రూ.20 వేల నగదు, కారు, బైకు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, 8ఎంఎం లైవ్‌ రౌండ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రహీల్‌ ఖాన్, ఆజాద్‌ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు