వైఎస్సార్‌ బీమా పేరిట మోసం

13 Oct, 2022 05:15 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌

అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడి అరెస్టు

9 అకౌంట్లలో ఉన్న రూ.7,34,964 ఫ్రీజ్‌ 

కడప అర్బన్‌: వైఎస్సార్‌ బీమా పేరుతో మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని వైఎస్సార్‌ జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పెన్నార్‌’ పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్‌ జిల్లాలో రెండు నెలలుగా ఓ అంతర్రాష్ట్ర ముఠా పథకం ప్రకారం కోవిడ్‌ సందర్భంగా మరణించిన మృతుల వివరాలను సేకరిస్తున్నది.

వాటి ఆధారంగా ఆయా మృతుల బంధువులకు ఫోన్‌లు చేసి.. తాము కలెక్టరేట్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నామని, వైఎస్సార్‌ బీమా పథకం కింద నష్టపరిహారం వస్తుందని మభ్యపెడుతోంది. అయితే అంతకుముందు.. కొంతమొత్తం ప్రభుత్వానికి చెల్లిస్తేనే ఆ మేరకు నష్టపరిహారం మంజూరవుతుందని అమాయక ప్రజలను నమ్మిస్తున్నది. అనంతరం ఫోన్‌–పే తదితర మనీ వ్యాలెట్ల నుంచి లక్షల రూపాయలను స్వాహా చేస్తోంది.

కడపకు చెందిన బీరం రమణారెడ్డి, నిర్మల, ఎం.వి. సునీత, ఖాజీపేటకు చెందిన నాగవేణి, పెండ్లిమర్రికి చెందిన విఘ్నేశ్వరి, విజయకుమారి, బి.మఠానికి చెందిన కృష్ణచైతన్య, ప్రొద్దుటూరుకు చెందిన జింక హారతి, బద్వేల్‌కు చెందిన పి.ఆదిలక్ష్మి సదరు ముఠా చేతిలో చిక్కి సుమారు రూ.9 లక్షల మేరకు సమర్పించుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేసి కడప వన్‌టౌన్‌ సీఐ ఎన్‌.వి.నాగరాజు దర్యాప్తు చేపట్టారు.

కేసు పరిశోధనలో భాగంగా కడప సైబర్‌ క్రైం టీం సహాయంతో యూపీఐల ఆధారంగా 9 బ్యాంక్‌ అకౌంట్లను గుర్తించారు. వీటిలోని రూ.7,34,964 ఫ్రీజ్‌ చేశారు. ముఠాలో సభ్యుడైన ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామానికి చెందిన మీనుగ వెంకటేష్‌ను ఇర్కాన్‌ జంక్షన్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. కొంతమంది వ్యక్తులతో కలిసి వెంకటేష్‌ ఢిల్లీలో ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి బీమా పేరిట దందాను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.  జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) తుషార్‌ డూడీ పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.  

మరిన్ని వార్తలు