-

దుబాయ్‌ కేంద్రంగా చైనీయుల దందా

24 May, 2023 03:42 IST|Sakshi

ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్స్‌లో ఆ దేశీయులే కీలకం 

అనేక కొత్త ఎత్తులు వేస్తున్న సూత్రధారులు 

బాధితులుగా మారిన వారి నుంచి బ్యాంకు ఖాతాలు 

వీటిని వినియోగించే మరికొంత మందికి టోకరాలు 

కేసుల దర్యాప్తులో గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్‌లో చిక్కుకున్న ఓ మహిళ దాదాపు రూ.10 లక్షలు నష్టపోయింది. ఈమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఉత్తరాదికి చెందిన నలుగురి ఖాతాల్లోకి ఆ డబ్బు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వారిని పట్టుకోగా.. వాళ్లంతా నిందితులుగా మారిన బాధితులని వెల్లడైంది. 

ప్రత్యేక ప్రోగ్రామింగ్‌తో వ్యవహారం... 
వివిధ రకాలైన సోషల్‌ మీడియా లింకుల ద్వారా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో ఎర వేస్తున్న నేరగాళ్లు తమ మోసాల కోసం ఆయా యాప్స్‌లో ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు బాధితులు పెట్టిన పెట్టుబడికి 50 నుంచి 80 శాతం లాభాలు రావడంతో పాటు ఆ మొత్తం డ్రా చేసుకోవచ్చు.

ఈ తర్వాత నుంచి లాభం వచ్చినట్లు యాప్‌­లో కనిపించినా డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతిసారీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచుతూ పోవాల్సిందే. ఇన్వెస్ట్‌ చేయగానే నిర్ణీత కాలంలో ఆ మొత్తం రెట్టింపు అయినట్లు యాప్‌లో కనిపిస్తుందే తప్ప తీసుకునే అవకాశం ఉండదు. 

హఠాత్తుగా కనిపించకుండా పోతూ...  
ఇలా బాధితుడి నుంచి కొంత మొత్తం వచ్చిన తర్వాత యాప్‌లో పెట్టుబడి ఆగిపోతుంది. ఆపై హఠాత్తుగా ఆ యాప్‌లోని బాధితుడి ఖాతా ఇక ఓపెన్‌ కాకుండా అదృశ్యమైపోతుంది. రోజూ రూ.లక్షలు కాజేస్తున్న ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌లో చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. 

బాధితులను సంప్రదించి ఖాతాలుకావాలంటూ.. పావులుగా మార్చి 
ఈ మోసగాళ్లు తమ వలలో పడి ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రా­డ్‌­లో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్ట­పో­యిన వారినే పావులుగా చేసుకుంటున్నారు.  బాధి­తు­లతో సంప్రదింపులు జరుపుతూ పోగొట్టుకున్న డబ్బు వెనక్కురావాలంటే తమకు కొన్ని బ్యాం­కు ఖాతాలు కావాలంటూ కోరుతున్నారు.  ఒక్కోఖాతాను రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఇస్తామంటూ ఆశపెడుతున్నారు. పోగొట్టుకున్న సొ­మ్ముల్లో ఎంతో కొంత వస్తుందని ఆశ పడిన బాధితులు ఇందుకు అంగీకరించి తమ కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల పేర్ల మీదా ఖాతాలు తెరుస్తున్నారు. 

అక్కడ నుంచే వీటిని ఆపరేట్‌ చేస్తూ..
ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌లను వాట్సాప్‌ ద్వారా బాధితులు సూత్రధారులకు పంపిస్తున్నారు. ఆపై వాళ్లు చెప్పే చిరునామాలకు లింకై ఉన్న ఫోన్‌ నంబర్లకు సంబంధించిన సిమ్‌కార్డులను కొరియర్‌ చేస్తున్నారు. వీటిని దగ్గర ఉంచుకుంటున్న సూత్రధారులు ఇక్కడ టార్గెట్‌ చేసిన వారితో నగదు ఈ ఖాతాల్లోనే వేయించుకుంటున్నారు.

కేసు నమోదై, పోలీసులు దర్యాప్తు చేపట్టినా బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నాటి బాధితుల వద్దకే వెళ్లి ఆగిపోవాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో ఈ ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్స్‌ పెరిగిపోయాయని చెప్తున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. పరిచయం లేని వారితో ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్టిమెంట్స్‌ వద్దని స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు