ఐవోబీ మాజీ ఉద్యోగులకు ఐదేళ్ల జైలు  

10 Sep, 2022 02:28 IST|Sakshi

జరిమానా కూడా విధిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు

తప్పుడు ధ్రువపత్రాలతో రుణాల మంజూరు కేసులో తీర్పు 

సాక్షి, హైదరాబాద్‌: తప్పుడు ఆదాయ పన్ను(ఐటీ) ధ్రువపత్రాలతో గృహ రుణాలు మంజూరు చేశారన్న కేసులో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ) హైదరాబాద్‌ మాజీ చీఫ్‌ మేనేజర్‌ సౌమన్‌ చక్రవర్తి, మాజీ సీనియర్‌ మేనేజర్‌ శంకరన్‌ పద్మనాభన్‌కు సీబీఐ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు టి.సత్య వెంకట దివాకర్, జూలూరి లక్ష్మయ్యలకు ఐదేళ్ల జైలు, రూ.75,000 జరిమానా, సయ్యద్‌ ముస్తక్‌ అహ్మద్, బొర్ర చంద్రపాల్, తోట రవీందర్, ఎం.గోపాల్‌రావు, బసవన్న రవీంద్రలకు మూడేళ్లు జైలు, రూ.75,000 జరిమానా విధించింది.

తప్పుడు పత్రాలు సృష్టించి గృహ రుణాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో 2005లో బ్యాంక్‌ అధికారులిద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ సేల్‌ డీడ్‌లను, గడువు ముగిసిన ఎల్‌ఐసీ పాలసీలతో రుణాలు మంజూరు చేసినట్లు విచారణలో తేలింది. 2007, నవంబర్‌లో సీబీఐ కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేసింది. ఇలా అక్టోబర్‌ 2003 నుంచి జనవర్‌ 2004 వరకు ఈ రుణాలు మంజూరు చేసి.. బ్యాంక్‌కు రూ.2.21 కోట్ల నష్టం కలిగించినట్లు తేలడంతో సీబీఐ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.   

మరిన్ని వార్తలు