ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠాల గుట్టు రట్టు

3 May, 2022 05:06 IST|Sakshi
విశాఖలో పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రికెట్‌ బెట్టింగ్‌ సామగ్రి

విశాఖలో ఇద్దరు, చిత్తూరులో 9 మంది అరెస్టు 

బెట్టింగ్‌ సామగ్రి, నగదు స్వాధీనం  

పెదవాల్తేరు(విశాఖ తూర్పు)/చిత్తూరు అర్బన్‌: రాష్ట్రంలోని చిత్తూరు, విశాఖల్లో సాగుతున్న భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. చిత్తూరులో తొమ్మిదిమందిని, విశాఖలో ఇద్దరిని అరెస్టు చేసి  వారినుంచి  బెట్టింగ్‌ సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఆయా పోలీసు కార్యాలయాల్లో సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ నగర పోలీస్‌కమిషనర్‌ శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా ఆర్‌కే బీచ్‌ రోడ్డులోని ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలోని మహారాజా టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లో ఒక అద్దె ఫ్లాట్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ 16 లైన్ల కమ్యూనికేషన్‌ వ్యవస్థతో నిర్వహిస్తున్న బెట్టింగ్‌ ప్రక్రియను చూసి పోలీసులు నివ్వెరపోయారు. భీమవరం ప్రాంతానికి చెందిన రాంబాబు (30), గంజి వీరవెంకట సత్యనారాయణ అలియాస్‌ సత్తిబాబు (36)ను అరెస్టు చేశారు.  త్రీటౌన్‌ సీఐ కోరాడ రామారావు దర్యాప్తు చేస్తున్నారు.   

చిత్తూరులో.. 
చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సంతపేటకు చెందిన టి.శేఖర్, పూతలపట్టు మండలం నొచ్చుపల్లికి చెందిన యుగంధర్‌బాబు మరికొంతమంది కలిసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న టూటౌన్‌ సీఐ యుగంధర్, ఎస్‌ఐ మల్లికార్జున, సిబ్బందితో కలిసి ఓబనపల్లి సమీపంలోని సివిల్‌ సప్లయ్‌ గోదాము వద్ద బెట్టింగ్‌కు పాల్పడుతున్న 9 మందిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.12.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సంతపేటకు చెందిన శేఖర్‌(41), రమేష్‌(46), పాంచాలీపురానికి చెందిన సెంథిల్‌కుమార్‌ (38), పాకాల మండలం గాంధీనగర్‌కు చెందిన నరేంద్ర(30), పూతలపట్టు మండలం నొచ్చుపల్లి గ్రామానికి చెందిన యుగంధర్‌బాబు(40), కుమార్‌బాబు(39), బండపల్లికి చెందిన లోకేష్‌(31), మనోహర్‌(30), మునిస్వామి(42)పై కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు