Karnataka Crime: చెరువు వద్ద మిస్టరీ...పాపను పాఠశాల వద్ద వదిలివస్తానని చెప్పి...

17 Nov, 2022 10:07 IST|Sakshi

కోలారు: బెంగుళూరు రూరల్‌కు చెందిన ఐటీ ఇంజినీర్‌ కూతురుతో సహా చెరువులోకి దూకిన ఘటన బుధవారం కోలారు తాలూకాలోని కెందట్టి వద్ద చోటు చేసుకుంది. గుజరాత్‌ నుంచి గత 3 సంవత్సరాల క్రితం బెంగళూరుకు వచ్చి హోసకోట తాలూకా చక్లాటి బాగలూరు లో నివాసం ఉంటున్న రాహుల్‌ (27), తన చిన్నారి కూతురు దియా (3)తో సహా చెరువులోకి దూకినట్లు తెలుస్తోంది. చెరువు వద్ద నీలం రంగు ఐ– 10 కారు ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది చెరువులోన గాలించగా పాప శవం దొరికింది, రాహుల్‌ జాడ తెలియరాలేదు.

స్కూల్లో వదిలి వస్తానని వెళ్లాడు: భార్య  
సమాచారం తెలిసి రాహుల్‌ భార్య భవ్య ఘటనా స్థలానికి వచ్చి కారు తమదేనని, పాప తన కూతురేనని బోరున విలపించింది. భర్త రాహుల్‌ కుమార్తెను పొద్దున్నే పాఠశాలలో వదిలి వస్తానని వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని ఆమె తెలిపింది. ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ వచ్చింది.  గత ఆరు నెలల కాలంగా రాహుల్‌ ఉద్యోగం లేక ఇంట్లోనే ఉండేవాడని, దీని వల్ల అప్పులు పెరిగినట్లు భవ్య చెప్పింది.  

పోలీసు విచారణకు భయపడి చేశాడా?  
ఇటీవల ఇంట్లో బంగారు నగలు చోరీ అయినట్లు రాహుల్‌ బాగలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు విచారణలో రాహుల్‌ బంగారాన్ని చెమ్మనూర్‌ జ్యూవెల్లర్స్‌లో తనఖా పెట్టినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని గట్టిగా మందలించి విచారణకు పిలిచారు.

దీంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా అని కోణంలో కోలారు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్న కారులో రాహుల్‌ మొబైల్‌ ఫోన్, పర్సు అన్నీ ఉన్నాయి. అతడు నిజంగా చెరువులోకి దూకాడా, లేక పరారు అయ్యాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.   

ఏమైందో తెలియదు: ఎస్పీ డి.దేవరాజ్‌  
ఐటి ఉద్యోగి రాహుల్‌కు ఏమైందో తెలియదు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. పోలీసుల భయమా, లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది విచారణలో తెలియాల్సి ఉంది. పాపను చెరువులోకి తోసి అతడు పరారై ఉంటాడు అనే అనుమానం కూడా వస్తోంది.  

(చదవండి: కాల్‌’ చేశాడు కటకటాల్లోకి చేరాడు! )

మరిన్ని వార్తలు