భార్యకు బీమా పత్రాలు, డెత్‌నోట్‌ వాట్సాప్‌ చేసి..

12 Feb, 2023 07:51 IST|Sakshi

సాక్షి, యశవంతపుర: ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు చెప్పాడు, తరువాత బీమా పత్రాలను, డెత్‌నోట్‌ను వాట్సప్‌ చేసి నడుస్తున్న రైలు కిందకు దూకి కేంద్ర ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర దూబె 10 ఏళ్ల నుంచి బెంగళూరులో ఐటీ శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు.

ఆయన యశవంతపురలోని బీడీఏ ఆఫీసు వద్ద నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. సుమారు 10 రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు.  దూబె చివరిసారిగా యూపీలో ఉంటున్న తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి  తరువాత బెంగళూరులో  భార్య ఆరతి మాళవికి కాల్‌ చేసి మాట్లాడి, ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు.

కొంతసేపటికి తన ఇన్సూరెన్స్‌ పత్రాల కాపీలను, సూసైడ్‌ నోట్‌ను భార్యకు వాట్సాప్‌ చేశాడు. నా మరణానికి నాదే బాధ్యత అని డెత్‌నోటులో రాశాడు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలించగా రైలు పట్టాల వద్ద మృతదేహం కనిపించింది. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.    

(చదవండి: అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు)

మరిన్ని వార్తలు