జగిత్యాల: షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం.. రూ. కోట్ల నష్టం

18 Aug, 2021 09:40 IST|Sakshi

రూ. 18 కోట్ల ఆస్తి నష్టం 

18 గంటలు శ్రమించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది  

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఓ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.18 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. కల్లూర్‌ రోడ్‌లో ఐదంతస్తుల్లో నిర్మించిన ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌ను ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మాల్‌లో మంటలు వ్యాపించడంతో యజమాని హరికుమార్‌  పోలీసులకు, మెట్‌పల్లిలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. బుధవారం వేకువజామున 2.15 గంటలకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే మంట లు రెండంతస్తుల వరకు వ్యాపించాయి. రెండు ఫైరింజన్లతో తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈలోగా మొత్తం ఐదు అంతస్తులోని ఫర్నిచర్, వస్త్రాలు మంటలకు ఆహుతయ్యాయి. దాని పక్కనే ఉన్న మరో రెండుషాపులకు సైతం మం టలు వ్యాపించాయి. ఈ రెండింటికి తోడు మరోరెండు ఫైరింజన్లు రావడంతో 18 గంటలపాటు శ్రమించి బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాం తంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ఇన్వర్టర్‌ బ్యాటరీ షార్ట్‌ సర్క్యూట్‌తోనే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నామని అగ్నిమాపక అధి కారి మురళీమనోహర్‌రెడ్డి తెలిపారు. రూ.6 కోట్ల విలువైన ఫర్నిచర్, ఇతర సామాగ్రి, ఐదంతస్తుల్లో ని రూ.12 కోట్ల విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోయినట్లు షాపు యజమాని తెలిపారు.

మరిన్ని వార్తలు