చెల్లెను చంపి.. అక్కను చంపబోయి..

15 Mar, 2021 14:08 IST|Sakshi
సంఘటన స్థలం వద్ద ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

డబ్బు అడిగినందుకు హత్య

సత్తక్కపెల్లిలో మృతదేహం లభ్యం

సాక్షి, జగిత్యాల: ఇటిక్యాల గ్రామానికి చెందిన పాలెపు నర్సమ్మ(60) అనే మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి వెలుగుచూసింది. ఎస్సై ఆరోగ్యం వివరాల మేరకు.. రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన పాలెపు శివమ్మ, నర్సమ్మ ఒంటరి మహిళలు. అదే గ్రామానికి చెందిన అంతడుపుల రాజారాం(35)తో వీరికి పరిచయం ఏర్పడింది. అక్కచెల్లెళ్ల వద్ద ఉన్న 25 గుంటల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని మాయమాటలు చెప్పి ఏడాదిక్రితం రూ.లక్ష తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడంతో డబ్బు తిరిగివ్వాలని రాజారాంను పదే పదే అడిగారు. ఎలాగైనా ఒంటరి మహిళల బాధ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో పథకం పన్నాడు. ముందుగా పాలెపు నర్సమ్మను ఫిబ్రవరి 26న వేములవాడకు వెళ్దామని చెప్పాడు. కుటుంబసభ్యులకు చెప్పి వేములవాడకు వెళ్లింది. వేములవాడకు వెళ్లిన నర్సమ్మ తిరిగిరాలేదు.

అక్క పాలెపు శివమ్మను కూడా అంతం చేయాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 28న భూమి రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని రాయికల్‌ రావాలని శివమ్మకు చెప్పి బైక్‌పై తీసుకెళ్లాడు. తహసీల్దార్‌ మేడిపెల్లికి వెళ్లాడని అక్కడ సంతకాలు పెడతారని నమ్మించాడు. అక్కడి నుంచి మేడిపెల్లిలోని ఎస్సారెస్పీ కెనాల్‌ వద్దకు తీసుకెళ్లాడు. ఎస్సారెస్పీ కెనాల్‌లోకి వెళ్లి ముఖం కడుక్కోమని చెప్పగానే శివమ్మ వెళ్లగా రాజారాం వెనుక నుంచి తోసేశాడు. కెనాల్‌లో కొట్టుకుపోతున్న శివమ్మ పక్కనే ఉన్న ఓ చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడింది. తన చెల్లె కనిపించకపోవడం, తనను చంపాలని ప్రయత్నించడంతో రాజారాంపై అనుమానం వచ్చిన శివమ్మ మార్చి 1వ తేదీన తన చెల్లె నర్సమ్మ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనపై రాజారాం హత్యయత్నం చేశాడని మరుసటి రోజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ నెల 4వ తేదీన రాజారాంను కస్టడీకి తీసుకొని విచారించారు. ఇబ్రహీంపట్నం మండలం సత్తక్కపెల్లి శివారులోని గుట్టపై అటవీప్రాంతంలో గొంతునులిమి నర్సమ్మను చీరతో హత్య చేసినట్లు పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో హంతకుడిని, కుటుంబసభ్యులను సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. కుళ్లిపోయిన మృతదేహం చూపించగా కుటుంబసభ్యులు గుర్తించగా నర్సమ్మను రాజారాం హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని జగిత్యాల రూరల్‌ సీఐ కృష్ణకుమార్, రాయికల్‌ ఎస్సై ఆరోగ్యం సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి అక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చదవండి: విషాదం: శుభకార్యానికి వెళ్తుండగా..

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

మరిన్ని వార్తలు