హనుమాన్‌ శోభాయాత్రలో హింస

18 Apr, 2022 06:25 IST|Sakshi
కాల్పులు జరుపుతున్న అస్లాం

ఢిల్లీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ 

ఎస్‌ఐపై కాల్పులు..  8 మంది పోలీసులు, స్థానికుడికి గాయాలు

21 మంది నిందితుల అరెస్టు

3 తుపాకులు, 5 కత్తులు స్వాధీనం

న్యూఢిల్లీ: హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో శనివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటిదాకా 21 మందిని అరెస్టు చేసినట్లు, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు అన్సర్‌తోపాటు ఎస్సైపై కాల్పులు జరిపాడంటున్న మహ్మద్‌ అస్లాంను అరెస్టు చేశామన్నారు. అస్లాం నుంచి పిస్తోల్‌ స్వాధీనం చేసుకున్నారు. ‘మసీదు సమీపంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దాడులకు దిగాయి.

8 మంది పోలీసులు, ఒక స్థానికుడు గాయపడ్డారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, ఐదు కత్తులు స్వాధీనం చేసుకున్నాం. ఇతర నిందితులనూ గుర్తిస్తాం. బులెట్‌ గాయాలైన ఎస్‌ఐ పరిస్థితి నిలకడగా ఉంది’ అని తెలిపారు. 2020 ఫిబ్రవరి తర్వాత ఢిల్లీలో మత ఘర్షణలు ఇదే మొదటిసారి. ఆదివారం జహంగీర్‌పూర్‌లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా పోలీసులు, క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంపైనే కేసులు సరి కాదని ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా అన్నారు.

బయటివారి  కుట్రే
శోభాయాత్ర సందర్భంగా ఓ వర్గానికి చెందిన ప్రార్థన మందిరంలోకి చొరబడి మతపరమైన జెండాలను ఎగురవేసేందుకు కొందరు ప్రయత్నించారని, రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్లే ఘర్షణ జరిగిందని అంటున్నారు. సి–బ్లాక్‌ మసీదు వద్ద ఘర్షణకు దిగినవారు ఇక్కడివారు కాదని, బయటి  నుంచి వచ్చినవారేనని స్థానికులు చెబుతున్నారు. జహంగీర్‌పూర్‌లో హిందువులు, ముస్లింలు దశాబ్దాలుగా కలసిమెలిసి జీవిస్తున్నారని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంటున్నారు. బయటి శక్తులు తమ మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడుతున్నారు.

వారిపైనా ఎఫ్‌ఐఆర్‌: ఎన్‌సీపీసీఆర్‌
ఢిల్లీ మతఘర్షణల్లో చిన్నారులు భాగస్వాములై రాళ్లు విసరడం పట్ల జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) ఆదివారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల్లో పిల్లలను వాడుకున్న వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను అదేశించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. హింస కోసం పిల్లలను వాడుకోవడం జువెనైల్‌ జస్టిస్‌ చట్టం కింద నేరమేనని గుర్తుచేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కేసులు పెట్టాలని పేర్కొంది. నిందితులపై చేపట్టిన చర్యలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.

ఉత్తరాఖండ్‌లోనూ..
హరిద్వార్‌: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో భగవాన్‌పూర్‌ ప్రాంతంలో హనుమాన్‌ జయంతి ఊరేగింపు సందర్భంగా శనివారం ఘర్షణ జరిగింది. ప్రదర్శనలో పాల్గొంటున్నవారిపై మరోవర్గం ప్రజలు రాళ్లు రువ్వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారని చెప్పారు. ఘర్షణకు కారణమైన 9 మంది నిందితులను అరెస్టు చేశామని, 13 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు