ఇదెక్కడి శాడిజం: భర్త కొట్టాడని కలలో కూడా ఊహించని ‘శిక్ష’ విధించింది

1 Aug, 2022 19:00 IST|Sakshi

భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు.. అప్పటికో, కాసేపటికో సర్దుకుపోవడం కూడా సహజమే. కానీ, ఒక్కోసారి అవి విపరీతాలకు కూడా దారి తీస్తుంటాయి. భార్యపై చెయ్యి చేసుకున్న ‘పాపాని’కి.. కలలో కూడా ఊహించని శిక్షపడింది ఆ  భర్తకు. 

భార్యను ఎత్తుకెళ్లి.. హత్య చేసిన కేసులో ఓ భర్తకు పదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్లపాటు పోలీసు విచారణ సాగడం గమనార్హం. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్‌ మీద వచ్చాడు అతను. మరో నాలుగేళ్ల తర్వాత.. ఈ మధ్యే మబ్బులు వీడిపోయే వార్త ఒకటి అతని చెవిన పడింది. అతని భార్య బతికే ఉందని!

ఉత్తర ప్రదేశ్‌ బహ్రాయిచ్‌ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్కడి ఏఎస్పీ అశోక్‌ కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాంపూర్‌ గ్రామానికి చెందిన కంధాయ్‌ అనే వ్యక్తి 2006లో అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. మూడేళ్ల తర్వాత అంటే 2009లో ఓరోజు హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రమావతి కుటుంబ సభ్యులు కంధాయ్‌ను కోర్టుకు ఇడ్చారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లి హత్య చేశాడని కేసు నమోదు చేయడంతో విచారణ కొనసాగింది. 

ఎనిమిదేళ్లు అయినా రమావతి తిరిగి రాకపోవడంతో చనిపోయి ఉంటుందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే సమయంలో కంధాయ్‌కు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడంతో..  2017లో స్థానిక కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నాడు అతను. అయితే కంధాయ్‌ కూడా ఊహించని ట్విస్ట్‌ ఒకటి బయటపడింది ఈమధ్యే.

బంధువులతో పరుగున.. 

రమావతి, కంధాయ్‌ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి.. ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ రమావతిని చూసి షాక్‌ తిన్నాడు అతను. వెంటనే విషయాన్ని కంధాయ్‌కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసిన కంధాయ్‌.. ఆలస్యం చేయకుండా తన బంధువులతో రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఈలోపు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వడంతో వాళ్లు అక్కడికి వచ్చారు. 

అంతా రమావతిని చూసి కంగుతిని.. అసలు విషయాన్ని ఆరా తీసేందుకు ఆమెను వన్‌ స్టెప్‌ సెంటర్‌(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి విచారించారు. చాయ్‌ విషయంలో జరిగిన గొడవతో భర్త తనపై చెయ్యి చేసుకున్నాడని, అది నచ్చకనే భర్తను జైలు పాలు చేయాలని ఇలా చేశానని అసలు విషయం చెప్పుకొచ్చిందామె. ఆమె చెప్పిన కారణం విని కంగుతిన్న భర్త, పోలీసులు, బంధువులు.. ఇన్నేళ్లపాటు ఆమె తన జాడను గోప్యంగా ఉంచడంపై ఆశ్చర్యపోతున్నారు. ఆమె అజ్ఞాతవాసం-కంధాయ్‌ కారాగారవాసం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ(సోమవారం) రమావతిని కోర్టులో హాజరుపర్చగా.. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు.

మరిన్ని వార్తలు