జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా.. 

9 May, 2022 08:04 IST|Sakshi

ఒకరిద్దరం ఉన్నా చాలు.. రోడ్లపై నానాయాగీ చేయడం ద్వారా చీప్‌ పబ్లిసిటీ కొట్టేయాలని చూస్తున్న జనసేన పార్టీ నేతలు ఆదివారం తిరుపతి వీధుల్లో చేసిన డ్రామా రక్తికట్టకపోగా.. పోలీసులు రంగంప్రవేశం చేసి అరెస్టులు చేయాల్సి వచ్చింది. అయితే పోలీసులుపైనే దురుసుగా మాట్లాడటం. వారి విధులకు ఆటంకం కలిగించేలా వీరంగం వేయడం, పత్రికల్లో రాయలేని మాటలు మాట్లాడుతూ రెచ్చిపోవడం, రాజ్యాంగపదవుల్లో ఉన్న వారిని లెక్కలేకుండా మాట్లాడటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
చదవండి: టీడీపీ నేతల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని రైతు ఆత్మహత్య 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆదివారం తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్‌ సమీపంలో జనసేన వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అక్కడితో ఆగని నేతలు సీఎం చిత్రపటాన్ని అమర్యాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుండగా.. సమాచారం తెలుసుకున్న ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.  పద్ధతి ప్రకారం నిరసన చేపట్టుకోవచ్చని, సీఎం చిత్రపటాన్ని అవమానించే రీతిలో వ్యవహరించొద్దని స్పష్టం చేశారు. కానీ రెచ్చిపోయిన సదరు పార్టీ నేతలు శ్రీకాళహస్తికి చెందిన కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబులు.. సీఎం మీకు.. మాకు కాదని వాగ్వాదానికి దిగారు.

పార్టీలు, రాజకీయాలు వేరు.. కానీ సీఎం అంటే అందరికీ... అని పోలీసులు సర్దిచెబుతున్నప్పటికీ కనీసం లెక్క చేయని జనసేన నేతలు వీరంగం చేశారు. అడ్డుకున్న మహిళా పోలీసులను నానా దుర్బాషలాడారు. పరిస్థితి చేయిదాటుతోందని భావించిన మహిళాపోలీసులు వారిని బలంవంతంగా అదుపులోకి తీసుకుని ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అదుపులోకి తీసుకునే సందర్భంలో పోలీసులపై మహిళా కార్యకర్తలు తిరగబడ్డారు. వినుతను తరలిస్తున్న ఆటోలోని పోలీసులను బండబూతులు తిడుతూ చేత్తో కొడుతూ వెంబడించారు. అయినాసరే పోలీసులు సంయమనం పాటించారు.

కేసులు నమోదు చేశాం..  సీఐ 
ట్రాఫిక్‌కి అంతరాయం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పబ్లిక్‌ న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసిన జనసేన నేతలపై సెక్షన్‌ 341, 143, 353, 290 రెడ్‌విత్‌ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఇలాంటి ఘటనలు బాధాకరం.
– శివప్రసాదరెడ్డి, సీఐ, తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌  

మరిన్ని వార్తలు