జనగామ: బాలుడి కిడ్నాప్‌ కేసు విషాదాంతం.. చంపి బావిలో పడేసి..

20 Sep, 2022 17:17 IST|Sakshi
బాలుడు షబ్బీర్‌, కిడ్నాపర్‌ మహబూబ్‌

సాక్షి, జనగామ: జనగామ జిల్లా కొడకండ్లలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కిడ్నాప్‌ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్‌ అయిన బాలుడు షబ్బీర్‌(5) దారుణ హత్యకు గురయ్యాడు. కిడ్నాపర్‌ మహబూబ్‌ బాలుడిని చంపి బావిలో పడేశాడు. నిందితుడు మహబూబ్‌ను సూర్యపేట జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సినిఫక్కీలో వెంబడించి తిరుమలగిరి సమీపంలో మహబూబ్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుడు మహబూబ్‌.. బాలుడి తండ్రి జమాల్‌కు వరుసకు అల్లుడుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

కాగా యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ జమీల్ కుటుంబం ఏడాది కాలంగా కొడకండ్లలో నివాసం ఉంటుంది. జమీల్‌ సమీపంలోని తిర్మలగిరి కర్రకోత మిషన్‌లో పనిచేస్తుండగా ఇతర కుటుంబీకులు అల్యూమినియం వస్తువులు తయారు చేస్తుంటారు. రోజూ మాదిరిగానే జమీల్‌ పనికి వెళ్లాడు. ఆ సమయంలో అతడి పెద్ద కుమారుడైన షాబీర్‌ గుడిసె బయట ఆడుకొంటూ కనిపించకుండా పోయాడు.

దీంతో తల్లి జరీనాతోపాటు మిగతా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలోనే బాలుడు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
చదవండి: మెడిసిన్‌ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి

మరిన్ని వార్తలు