నిర్వాహకులదే నిర్వాకం!? 

9 Apr, 2022 10:39 IST|Sakshi

వైస్‌ చైర్‌పర్సన్‌ చేతివాటంతో జయలక్ష్మి సొసైటీ దివాలా?

ప్రాథమిక విచారణలో  అవకతవకల నిర్ధారణ

వైస్‌ చైర్‌పర్సన్‌ పేరిట సుమారు రూ.64 కోట్ల రుణం

బినామీ పేర్లతో కలిపి సుమారు రూ.200 కోట్ల రుణం

మొత్తం రూ.520 కోట్ల డిపాజిట్లకు లోపించిన జవాబుదారీతనం

డిప్యూటీ రిజిస్ట్రార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక

కాకినాడ రూరల్‌: వేలాది మంది నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసి కాకినాడలోని సర్పవరం జంక్షన్‌లో బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ బాగోతం నిర్వాహకుల నిర్వాక ఫలితమేనని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో స్వార్థ ప్రయోజనాల కోసమే వారు సొసైటీని దివాళా తీయించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. తమ కష్టారితాన్ని ఎంతో నమ్మకంతో సొసైటీలో పొదుపు చేసుకున్న సభ్యులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  

ఎవరికి వారే యమునా తీరే 
రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు కలిగి సుమారు పదివేల మంది నుంచి డిపాజిట్ల రూపంలో రూ.520 కోట్లు సేకరించిన జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్‌ సొసైటీలో జవాబుదారీతనం పూర్తిగా లోపించింది. ఈ కుంభకోణంపై అడిగేందుకు పాలకవర్గం అందుబాటులో లేదు. ఒకరిద్దరు సిబ్బంది ఉన్నా తమకేమీ తెలీదని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డిపాజిటర్ల సొమ్ములు తిరిగి చెల్లించడం ఇప్పట్లో అసాధ్యంగా కనిపిస్తోంది.

మరోవైపు.. సుధాకర్‌ అనే ఉద్యోగి ఫిర్యాదుతో సొసైటీలో సహకార శాఖాధికారులు ప్రాథమిక విచారణ పూర్తిచేసి నివేదికను ఉన్నతాధికారులకు గురువారం రాత్రి అందజేశారు. తొలుత ముగ్గురు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు, తరువాత సహకార శాఖ కమిషనర్‌ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్‌ కృష్ణకాంత్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు జవహర్, ఏవీ లక్ష్మి, పి. ఉమాశంకర్, వెంకటేశ్వరరావుల బృందం రెండ్రోజుల పాటు విచారణ చేపట్టింది. సొసైటీలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.  

సొసైటీ వైస్‌ చైర్‌పర్సన్‌ నిర్వాకం 
కంచే చేను మేసింది అన్నట్లుగా.. సొసైటీ వైస్‌ చైర్‌పర్సన్‌ హోదాలో ఉన్న ఆర్‌బీ విశాలక్షి తన స్వార్థ ప్రయోజనాల కోసం సొసైటీని దివాలా తీసేలా చేశారని అధికారులు అంచనాకు వచ్చారు. సుమారు రూ.64 కోట్ల వరకు ఆమె రుణాలు రూపేణా వాడుకోగా మరో రూ.140 కోట్లను బినామీల పేరిట అందించారు. ఇలా మొత్తం రూ.200 కోట్లు పక్కదారి పట్టాయి. మరో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు రుణాలిచ్చినా వాటికి సరైనా సెక్యూరిటీ లేకపోవడంతో అవి పత్తాలేకుండా పోయాయి. దీంతో సొసైటీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది.  

విశాఖ సంస్థే కారణం? 
ఇక సొసైటీ దివాలాకు విశాఖపట్నానికి చెందిన రావు అండ్‌ రావు చార్టెడ్‌ అకౌంటెంట్స్, కన్సెల్టెంట్స్‌ ప్రధాన కారణమని భావిస్తున్నారు. సొసైటీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా ఉన్నప్పుడు వీరు అడ్డుకట్ట వేయాల్సింది పోయి వైస్‌ చైర్‌పర్సన్‌కు సహకరించడంతో బినామీల ద్వారా డిపాజిట్లను పక్కదారి పట్టించేందుకు బీజం వేసినట్లు అధికారుల బృందం ప్రాథమిక విచారణలో తేల్చి నివేదికను డీసీఓ దుర్గాప్రసాద్‌కు అందజేసింది. ఆయన దానిని గుంటూరులోని సహకార శాఖ రిజిస్ట్రార్, కమిషనర్‌లకు పంపారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. జయలక్ష్మి సొసైటీలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలడంతో సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్‌ల విచారణకు ఆదేశించాలని కోరామన్నారు. అలాగే, సీబీసీఐడీ విచారణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక సొసైటీలో క్షుణ్ణంగా విచారణ నిర్వహించేందుకు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. 

30మంది డిపాజిటర్ల ఫిర్యాదులు 
మరోవైపు.. సర్పవరం, టూటౌన్, ఇంద్రపాలెం, పిఠాపురం తదితర  పోలీసుస్టేషన్లలో డిపాజిటర్లు తమ సొమ్ము కోసం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణను వివరణ కోరగా.. తమకు 30మంది వరకు ఫిర్యాదులు ఇచ్చారని, ఎస్పీ సూచనల మేరకు వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  

మరిన్ని వార్తలు