బావిలో పడిన జీపు నలుగురి జలసమాధి

28 Oct, 2020 05:13 IST|Sakshi

ప్రాణాలతో బయటపడిన 11మంది  ప్రయాణికులు

ప్రమాద సమయంలో జీపులో 15 మంది 

డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో అదుపు తప్పిన వాహనం 

పొద్దుపోయాక బయటపడిన డ్రైవర్‌ సతీష్‌ మృతదేహం 

కొనసాగుతున్న గాలింపు చర్యలు

వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలంలో ఘటన  

సంగెం: ఓ జీపు అదుపు తప్పి బావిలో పడటంతో డ్రైవర్‌ సహా నలుగురు జల సమాధి అయ్యారు. మరో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద చోటుచేసుకుంది. డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామానికి చెందిన సతీష్‌.. నిత్యం వరంగల్‌ నుంచి నెక్కొండ వరకు జీపు నడుపుతుంటాడు. రోజు మాదిరిగా మంగళవారం సాయంత్రం వరంగల్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద 15 మంది ప్రయాణికులను ఎక్కించుకొని నెక్కొండకు బయలుదేరాడు, మార్గమధ్యలో గవిచర్లలోని మోడల్‌ స్కూల్‌ దాటిన తర్వాత డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడం.. ఆ సమయంలో జీపు వేగంగా ఉండటంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడిపోయింది.

దీంతో డ్రైవర్‌ సతీష్‌ సహా నలుగురు వ్యక్తులు జల సమాధి అయ్యారు. జీపు వెనుక కూర్చున్న బండి కట్టయ్య (నెక్కొండ), బానోత్‌ రామచంద్రు, ఆయన భార్య విజయ (మడిపెల్లి, కస్నా తండా), గుగులోతు బుజ్జి, గుగులోతు వాగ్యా, ఆయన భార్య మంజుల, భూక్యా పీతాలి (భూక్యా తండా, మదనపురం), భూక్యా శ్రీనివాస్‌ (జుద్యా తండా), భూక్యా నవీన్‌ (రెడ్లవాడ), మాలోత్‌ సుజాత (మూడెత్తుల తండా)లతో పాటు మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సహాయక చర్యల్లో భాగంగా రాత్రి 9 గంటలకు డ్రైవర్‌ మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. భారీ మోటార్లను తెప్పించి నీటిని తోడేందుకు యత్నిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

దేవుడే రక్షించాడు.. 
గవిచర్ల మోడల్‌ స్కూల్‌ దాటగానే డ్రైవర్‌ సతీష్‌కు ఫిట్స్‌ రావడంతో జీపును కంట్రోల్‌ చేయలేకపోయాడని, అదే సమయంలో గతుకుల రోడ్లపై అతి వేగంగా వెళ్తుండటంతో ప్రయాణికులు ఎగిరి టాప్‌కు తగిలారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంచెం వేగం తగ్గించాలని చెబుతుండగానే జీపు అదుపు తప్పి బావిలో పడిపోయిందని ప్రాణాలతో బయటపడిన రామచంద్రు తెలిపారు. తాను ఈదుకుంటూ ఒడ్డుకు చేరి తన భార్యను రక్షించానని తెలిపాడు. తర్వాత మరో ఇద్దరు మహిళలను ఒడ్డుకు చేర్చానని పేర్కొన్నాడు. వాగ్యా, శ్రీనివాస్‌లు బయటకు వచ్చి మరో ఇద్దరి బయటకు లాగారని వివరించారు. తమను ఆ దేవుడే రక్షించాడని తెలిపారు.   విషయం తెలుసుకున్న వెంటనే సంగెం ఎస్సై సురేశ్‌ ఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాం సుందర్, పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ కిషన్, అగ్నిమాపక శాఖ సిబ్బంది డీజే లైట్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.  

నీరు ఉండటంతో బయటపడ్డాం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బావిలో నీరు నిండుగా ఉంది. ఇదే తమ ప్రాణాలు కాపాడిందని బాధితులు తెలిపారు. జీపు వెనుక భాగంలో ఉన్న 10 మందితో పాటు ముందు కూర్చున్న ఒకరు నీటిలో తేలగానే.. చెట్టు కొమ్మలను పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నామని చెప్పారు.   

మరిన్ని వార్తలు