‘తండ్రి’ పెదాలను తాడుతో కుట్టి.. వీడసలు మనిషేనా?

15 Jul, 2021 10:48 IST|Sakshi

జార్ఖండ్‌ రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది. 65 ఏళ్ల వృద్ధుడి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్‌కు కట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు సవతి కొడుకు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రైల్వే ట్రాక్‌ నుంచి వృద్ధుడిని రక్షించారు. పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్‌లోని భీతిహర గ్రామంలో భోలా రామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోగా 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రిపై రెండో భార్య కొడుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోలా రామ్‌ మూత్ర విసర్జనకు బయటకు వెళ్లగా.. అదే సమయంలో కొడుకు మరో ఇద్దరితో కలిసి వృద్ధ తండ్రిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు తండ్రి పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్ళను కట్టి, సమీపంలోని రైల్వే ట్రాక్‌కు తీసుకొని వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో భోలా రామ్‌ను రైల్వే ట్రాక్‌తో కట్టేసి వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఉదయాన్నే గ్రామస్తులు ట్రాక్‌పై కట్టి పడేసిన వ్యక్తిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వృద్ధుడి పెదాలను కలిపి కుట్టుడానికి ఉపయోగించిన తాడును వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో రెండో భార్య హస్తం కూడా ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్టు చేస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ‘‘వీడసలు మనిషేనా. తండ్రి అన్న గౌరవం లేకపోయినా, సాటి మనిషి అన్న కనికరం అయినా ఉండాలి కదా’’ అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు