కేటుగాళ్ల మాయ.. 19 లక్షలు స్వాహా

8 May, 2021 14:20 IST|Sakshi
నకిలీ జాయినింగ్‌ లెటర్‌

సాక్షి, ఆదిలాబాద్‌ : ఉద్యోగం ఇప్పిస్తామంటూ డబ్బులు కాజేసిన ఘటన నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం బాధితుడు రాజన్న, మంచిర్యాల రూరల్‌ సీఐ కుమారస్వామి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సీసీసీ కార్నర్‌ రామ్‌నగర్‌లో నివాసం ఉంటూ గంధం రాజన్న మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్‌లో పని చేస్తున్నాడు. కరీంనగర్‌లో నివాసం ఉండే దూరపు బంధువులు ముద్దసాని అన్వేష్, ముద్దసాని అభిలాష్‌ అనే అన్నదమ్ములు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామంటూ రాజన్నను నమ్మబలికారు. అభిలాష్‌ ఏ పని లేకుండా తిరుగుతుండగా.. అన్వేష్‌ కరీంనగర్‌లోని జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అన్వేష్‌ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నమ్మిన రాజన్న అన్నదమ్ములు ఇద్దరికి విడతల వారీగా మొత్తం రూ. 19 లక్షల 80వేలు ముట్టజెప్పాడు. 

బాధితుడికి నకిలీ జాయినింగ్‌ లెటర్‌..
రాజన్న తన ఉద్యోగం విషయం అన్నదమ్ములను పలుమార్లు అడుగడంతో కేటుగాళ్లు ఏకంగా నకిలీ జాయినింగ్‌ లెటర్‌ సృష్టించారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చిందని, 17–07–2020న ఉదయం 10.30 నిమిషాలకు రిపోర్ట్‌ చేయాలని, గంగాధర తహసీల్దార్‌ కార్యాలయం స్టాంప్, తహసీల్దార్‌ సంతకంతో కూడిన ఒక నకిలీ పత్రాన్ని సృష్టించారు. అయితే రాజన్న అది నకిలీ పత్రమని గుర్తించి తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమని వారిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వారు స్పందించకపోవడంతో రాజన్న మోసపోయానని గ్రహించి సీసీసీ నస్పూర్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మంచిర్యాల రూరల్‌ సీఐ కుమారస్వామి తెలిపారు.

చదవండి: ఓఎల్‌ఎక్స్‌ మోసం.. దొంగ దొరికేశాడుగా!

మరిన్ని వార్తలు