నంద్యాలలో విలేకరి దారుణహత్య

9 Aug, 2021 03:32 IST|Sakshi
కేశవ (ఫైల్‌)

కక్షగట్టి ఘాతుకానికి పాల్పడిన కానిస్టేబుల్‌?

సోదరుడితో కలిసి హత్య 

బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ చానల్‌ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్యచేశారు. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్‌ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్‌ కానిస్టేబుల్‌ సుబ్బయ్యకు ఉన్న సంబంధాలను బట్టబయలు చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కానిస్టేబుల్‌ సుబ్బయ్యను సస్పెండ్‌ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్‌ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్‌ కాలనీలోని ఆటోస్టాండ్‌ వద్దకు పిలిపించాడు.

కేశవ తోటి రిపోర్టర్‌ ప్రతాప్‌తో కలిసి ఎన్జీవోస్‌ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్‌ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్‌ అవినీతి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన విలేకరిని హత్యచేయటం పట్ల జర్నలిస్ట్‌ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కేశవ మృతదేహాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, తాలుకా సీఐ మురళిమోహన్‌రావు పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు