నిన్ననే ప్రాణభయం అన్నాడు.. గంటల వ్యవధిలో శవమై కనిపించాడు

14 Jun, 2021 13:06 IST|Sakshi

మద్యం మాఫియా ఆగడాలపై కథనాలు 

యూపీ జర్నలిస్టు అనుమానాస్పద మృతి

ప్రాణగండం ఉందని లేఖ రాసిన మరునాడే దారుణం

సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గడ్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మాఫియాపై సంచలన కథనాలను అందించిన ఓ టీవీ జర్నలిస్ట్  అనుమానాస్పద మృతి కలకలం రేపింది.తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ జర్నలిస్టు సులాబ్ శ్రీవాస్తవ (42) పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాసిన 24గంటల్లోనే ఆదివారం రాత్రి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. అయితే పోలీసులు మాత్రం రోడ్డు ప్రమాదంలోనే శ్రీవాస్తవ చనిపోయినట్టు  భావిస్తున్నారు. 

శ్రీవాస్తవ ఆదివారం రాత్రి 11 గంటలకు విధులను ముగించుకుఒని బైక్‌పై ఇంటికివస్తుండగా, దుండగులు అతనిపై ఎటాక్‌ చేశారు. తీవ్రంగా కొట్టి, ఒంటిపై బట్టలను దాదాపు తీసేసి రోడ్డుపక్కన ఒదిలేసి పోయినట్టు తెలుస్తోంది.  అయితే పోలీసుల వెర్షన్‌ మాత్రం భిన్నంగా ఉంది. శ్రీవాస్తవ  బైక్‌పై నుంచి కిందికి పడి, తలకు దెబ్బ తగిలడంతొ చనిపోయారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.  అపస్మారక స్థితిలో శ్రీవాస్తవను గుర్తించిన స్థానికులు కొంతమంది ఆసుపత్రికి తరలించారనీ, అప్పటికే ప్రాణాలు విడిచినట్టు వైద్యులు ప్రకటించారని సీనియర్ పోలీసు అధికారి సురేంద్ర ద్వివేది ప్రకటించారు. ఇతర కోణాలనుకూడా పరిశీలిస్తున్నామన్నారు. 

ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ, యూపీ యోగీ సర్కార్‌పై మండిపడ్డారు. అలీఆగర్‌నుంచి ప్రతాప్‌ఘర్‌వరకు మద్యం మాఫియా వేళ్లూనుకొందని విమర్శించారు. నిజాలను బయటపెడుతున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతోంటే.. ప్రభుత్వం నిద్రపోతోందంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. కాగా జిల్లాలోని మద్యం మాఫియాకు వ్యతిరేకంగా జూన్ 9న సంచలన కథనాన్ని ప్రసారం చేసినప్పటినుంచి తనకు బెదిరింపు లొస్తున్నాయని, తన ప్రాణభయం ఉందంటూ సీనియర్‌ పోలీసు అధికారికి లేఖ రాశారు. దీంతో తాను, తన కుటుంబం కూడా చాలా ఆందోళన చెందుతోందని, రక్షణ కల్సించాలని శ్రీవాస్తవ ఆ లేఖలో పేర్కొన్నారు.  ఈలేఖను ధృవీకరించిన  సీనియర్ పోలీసు అధికారి దీనిపై  విచారణ నిమిత్తం  స్థానిక అధికారులకు సూచించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీవాస్తవ మృతి భయాందోళన రేపింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు