అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయించండి

2 Apr, 2021 08:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల సేవల్లో లోపాలపై సంబంధిత అధికారులకు ముందుగా ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల దోపిడీని కట్టడి చేసేలా, వాటి పనితీరులో జవాబుదారీతనం పెంచేలా నిబంధనలు రూపొందించేందుకు నిపుణులతో కమిటీ వేయాలంటూ జర్నలిస్టు కాజీపేట నరేందర్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది.

2016లో నరేందర్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన సోదరి మృత్యువాతపడ్డారని, ఇలా మరొకరికి జరగకుండా ఉండాలంటే నిపుణులతో కమిటీ వేసి కార్పొరేట్‌ ఆసుపత్రుల పనితీరులో జవాబుదారీతనం పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. తమ వాదనను రాష్ట్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ సమర్థించారని పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ నివేదించారు. అయితే ముందు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోతే తిరిగి పిటిషన్‌ దాఖలు చేసుకునేలా స్వేచ్ఛనిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.  


 ఆరోగ్యశ్రీ పథకం అమలులో లోపాలు 
‘‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అమలును పరిశీలించేందుకు 2009లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశాం. ఆరోగ్యశ్రీ కింద చేరే రోగులకు కన్సల్టేషన్‌ ఫీజు తీసుకోరాదని నిబంధనలు చెబుతున్నా తీసుకుంటున్నాయి. బయట ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో స్కానింగ్‌ పరీక్షలు చేయించుకొని రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. ఉచితంగా రవాణా కల్పించడంలేదు. ఉచితంగా మందులు ఇవ్వడంలేదు. ఆరోగ్యశ్రీలో నిర్దేశించిన ఫీజులకన్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ మొత్తాన్ని రోగుల నుంచి వసూలు చేశాయి. శస్త్రచికిత్స తర్వాత వైద్యసహాయం అందివ్వాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్‌ రూ.14 వేల స్టంట్స్‌ను వేసి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.30 వేలు తీసుకున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డబ్బు కడితేనే రోగులను చేర్చుకుంటామంటూ ఒత్తిడి చేస్తున్నాయి. మరో ఆసుపత్రి అయితే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని అదనంగా మరో రూ.40 వేలు రోగి నుంచి వసూలు చేసింది. కార్పొరేట్, ప్రైవేట్‌ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’’అని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ త్రివేది తన కౌంటర్‌లో వివరించారు. ( చదవండి: జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు )

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు