జూనియర్‌ ఆర్టిస్ట్ ని మోసగించిన ఎస్ఐ అరుణ్‌

19 Feb, 2024 09:40 IST|Sakshi

హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని శారీరకంగా లోబరుచుకుని.. మరో యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్న కేసులో సిద్దిపేట కమిషనరేట్‌కు చెందిన ఎస్‌ఐని సైదాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్‌ (29) ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణ్‌ 2021లో సైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనీ ఎస్‌గా పని చేశాడు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన యువతి (23) సైదాబాద్‌ సరస్వతీనగర్‌ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్‌ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. 2022 జనవరిలో బంధువుల కుటుంబ సమస్యల విషయమై సదరు యువతి అప్పట్లో సైదాబాద్‌ పీఎస్‌కు వెళ్లింది. 

ఈ క్రమంలోనే ట్రైనీ ఎస్‌ఐ పబ్బా అరుణ్‌ ఆమెకు పరిచయమయ్యాడు. వీరు తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్‌ఐ అరుణ్‌ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ట్రైనింగ్‌ పూర్తయిన తర్వాత అతను సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లలో పని చేస్తున్న సమయంలోనూ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు. ఇటీవల అరుణ్‌కు వేరే యువతితో వివాహ నిశి్చతార్థమైన ఫొటోలను స్మార్ట్‌ ఫోన్‌లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది.

 ఖంగు తిన్న అతను నిశ్చితార్థాన్ని ఉపసంహరించుకుంటానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. నిశ్చితార్థమైన యువతి సోదరుడు బాధిత యువతికి గత నెల ఫోన్‌ చేశాడు. అరుణ్‌ తన సోదరినే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె అరుణ్‌కు ఫోన్‌ చేసి ఈ విష యంపై ప్రశ్నించడంతో.. ‘అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు నన్ను మరచిపో’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి శనివారం సైదాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ పబ్బా అరుణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

whatsapp channel

మరిన్ని వార్తలు