తీగలే.. మృత్యుపాశాలై..

30 Jul, 2021 20:23 IST|Sakshi

సాక్షి,శ్రీకాకుళం: మండల కేంద్రం ఎల్‌.ఎన్‌.పేటలో గురువారం విద్యుత్‌ స్తంభంపై వైర్లు సరిచేస్తున్న సమయంలో షాక్‌కు గురై గ్రామ సచివాలయ గ్రేడ్‌–2 జేఎల్‌ఎం (జూనియర్‌ లైన్‌మేన్‌) సాహుకారి వెంకటరమణ(36) మృతి చెందాడు. విద్యుత్‌ సిబ్బంది, మృతుని కుటుంబ సభ్యులు, సరుబుజ్జిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎల్‌.ఎన్‌.పేట మండలం బొత్తాడసింగి గ్రామానికి చెందిన వెంకటరమణ తన ఊరిలోనే గ్రామ సచివాలయంలో గ్రేడ్‌–2 జేఎల్‌ఎంగా పనిచేస్తున్నాడు. ఎల్‌.ఎన్‌.పేటలోని ఓ వీధిలో కొన్ని ఇళ్లకు విద్యుత్‌ సరఫ రా హెచ్చుతగ్గులు జరుగుతుండటంతో వైర్లు సరిచేసేందుకు స్థానిక లైన్‌మేన్‌ రమేశ్‌, మరికొందరు జేఎల్‌ఎంలతో కలిసి వెంకటరమణ కూడా వెళ్లాడు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ విద్యుత్‌ సమస్య వచ్చినా వీరంతా కలిసి పనిచేసుకుంటారు.

ఈ క్రమంలోనే విద్యుత్‌ స్తంభం ఎక్కిన వెంకటరమణ వైర్లు సరిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వాస్తవానికి, ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేశామని, సమీప ప్రాంతంలోని బ్యాంకు ఇన్వర్టర్ల నుంచి రిటన్‌ విద్యుత్‌ సరఫరా కావటంతో ఈ ఘట న జరిగినట్లు భావిస్తున్నామని లైన్‌మేన్‌ రమేష్‌ తెలిపారు. వెంకటరమణకు భార్య రాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే రెండో కుమారుడికి బారసాల చేశారు. ఇంతలోనే విషాదం జరగడంతో కుటు కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ట్రాన్స్‌కో ఏడీఈ ఆర్‌.శ్రీనివాసరా వు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సరుబుజ్జిలి ఎస్సై పి.నర్సింహామూర్తి  చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించామని తెలిపారు.  

మరిన్ని వార్తలు