సార్‌.. ఎవ్వరినీ వదిలిపెట్టొదు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు!

15 Sep, 2021 21:35 IST|Sakshi
ఝాన్సీ, రాధాకృష్ణల వివాహ దృశ్యం (ఫైల్‌)  

భర్త, అత్తమామల వేధింపులే కారణం

వరకట్నచావు కింద కేసు నమోదు

అత్తింటివారి వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైపోయింది. పెళ్లయిన నెల రోజులకే తనువు చాలించింది. భర్త, అత్తమామల వేధింపులకు నిండు నూరేళ్ల జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 

సాక్షి, కడప:  జీవితాంతం తోడు నీడగా ఉంటానని పచ్చని పెళ్లిపందిరిలో బాస చేసిన భర్త మాట తప్పాడు. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కడప నగరం నెహ్రూనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి, బంధువుల ఫిర్యాదు మేరకు చిన్నచౌక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.  

కడప చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పద్మజ కుమార్తె ఝాన్సీ(26)కి, రాజంపేట బోయిన పల్లికి చెందిన నల్లు సుబ్రమణ్యం, వెంకటసుబ్బమ్మల కుమారుడు రాధాకృష్ణతో గత నెల 15వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రాధాకృష్ణ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో కట్నకానుకల కింద 15లక్షల రూపాయలు ఇచ్చారు. వివాహమైన రెండవరోజు నుంచే అధిక కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. రూ. 70 లక్షలు ఇస్తేనే సంసారానికి రావాలంటూ ఈనెల 2వ తేదీన అత్తా, మామలు ఝాన్సీని కడపలోని నెహ్రూనగర్‌లో ఉన్న పుట్టింటిలో వదిలివెళ్లారు.
చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో

పెద్దమనుషులంతా కలిసి రాజంపేటలోని బోయినపల్లిలో ఉన్న రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పంచాయితీ చేశారు. తనకు రూ. 70 లక్షలు ఇస్తేనే తన భార్యను సంసారానికి తీసుకెళతానని తేల్చిచెప్పాడు. తన వల్ల తల్లి పద్మజ, తమ్ముడు పవన్, కుటుంబ సభ్యులకు అవమానంగా ఉందని భావించిన ఆ యువతి సూసైడ్‌ నోట్‌ రాసి, ఇంటిలో ఎవరూ గమనించని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, తమ్ముడు గమనించే సరికి ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు.

సార్‌.. ఎవ్వరినీ వదిలిపెట్టొదు.. 
డియర్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌..ఎవ్వరినీ వదిలిపెట్టొ్టద్దు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు.. వాళ్లు చాలా క్రిమినల్‌ మైండ్‌ కలవాళ్లు.. మా తల్లిని, కుటుంబాన్ని రక్షించండి..  పవన్‌ ( తమ్ముడు) నువ్వు ఏడవద్దు.. మా తల్లికి, తమ్ముడికి భవిష్యత్తులో ఆపద వస్తే అది రాధాకృష్ణ వల్లనే... అంటూ సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది.  అలాగే నా భర్త రాధాకృష్ణకు నేను అడ్డుగా ఉన్నా.. ఇప్పుడు తొలగిపోతున్నా... నువ్వు మీ చెల్లెళ్లను చూసుకో.. హ్యాపీగా ఉండు.. అని భర్తను ఉద్దేశించి కూడా రాసింది. సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిమ్స్‌ మార్చురీలోని మృతదేహాన్ని కడప డీఎస్పీ సునీల్‌ పరిశీలించారు. చిన్నచౌక్‌ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వరకట్న చావు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌక్‌ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.  
చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే..

మరిన్ని వార్తలు