మమ్మల్నెందుకు చంపావమ్మా.!

19 Mar, 2021 12:40 IST|Sakshi

తాను పురుగుల మందు తాగి..

పిల్లలకు తాపించి తల్లి ఆత్మహత్యా యత్నం

ముగ్గురు చిన్నారులు మృతి

తల్లి పరిస్థితి విషమం

పెండ్లిమర్రి మండలం

మిట్టమీదపల్లెలో విషాదం

అమ్మా.. నువ్వు జోలపాడి మమ్మల్ని నిద్ర పుచ్చుతుంటే మేమంటే నీకు ఎంత ప్రేమో అనుకున్నాం.. కమ్మని పాలు తాగిస్తుంటే మా కోసం నువ్వు తెచ్చిన అమృతం అనుకుని మధురంగా గేవాళ్లం.. అభం.. శుభం తెలియని మేము.. నువ్వు ఏం చేసినా మా కోసమే చేస్తావని నమ్మేవాళ్లం.. అవునమ్మా.. అమ్మంటే నమ్మకం కదమ్మా.. అందుకేనమ్మా.. నువ్వు విషం ఇచ్చినా నమ్మకంతో కమ్మగా తాగేశాం.. మేం ఆ దేవుడి వద్దకు వెళ్లాక గానీ తెలియలేదమ్మా.. నువ్వు మమ్మల్ని చంపేందుకే విషం తాగించావని.. అమ్మా.. ఇప్పుడైనా చెప్పమ్మా.. మమ్మల్నెందుకు చంపావమ్మా.. మేం.. ఏం పాపం చేశామమ్మా.. మేం ఎలాగూ దూరమయ్యాం.. నువ్వయినా.. నాన్నతో కలిసి క్షేమంగా ఉండమ్మా.. (ఇ‘ఇది తల్లి విషం తాగించడంతో మృతి చెందిన చిన్నారుల ఆత్మఘోష..

సాక్షి, కడప: పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన సుబ్బనరసమ్మ తన భర్త నిత్యపూజయ్యతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తాను పురుగుల మందు తాగి పిల్లలకు సైతం తాపించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో లోకం తెలియని ముగ్గురు చిన్నారులు తనువు చాలించారు. తీవ్ర విషాదం మిగిలి్చన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన నిత్యపూజయ్య పొలం పనులు, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతనికి భార్య సుబ్బనరసమ్మ, సుబ్బరాయుడు (3), సుబ్బరత్న (2), బాబు (రెండు నెలలు) అనే పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఉండడంతో పెద్ద మనుషులు సర్దుబాటు చేసేవారు. ఇటీవల కొన్ని రోజులుగా ఆ మనస్పర్థలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో గురువారం భార్యతో గొడవపడి భర్త పొలం పనికి వెళ్లిపోయాడు.

ఇంట్లో ఒంటరిగా ఉన్న సుబ్బనరసమ్మ తాను ఆత్మహత్యకు పాల్పడాలని అనుకుంది. తాను చనిపోతే పిల్లలను ఆదరించేది ఎవరని భావించిందో ఏమో వారికి కూడా తనతోపాటే పురుగుల మందు తాపించింది. నలుగురు ఇంటిలో నుంచి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో పిల్లల నానమ్మ అయ్యవారమ్మ ఇంటి తలుపు తీసి గమనించింది. నలుగురు నేలపై పడిపోయి ఉండటాన్ని గమనించి వెంటనే విలపిస్తూ స్థానికులను పిలిచింది. వారి సాయంతో నలుగురిని రిమ్స్‌కు తరలించారు.  కొద్దిసేపటికి ముగ్గురు చిన్నారుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సుబ్బనరసమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెడికల్‌ ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం...అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ బూడిద సునీల్, రిమ్స్‌ సీఐ పి.సత్యబాబు, పెండ్లిమర్రి ఎస్‌ఐ ఆర్వీ కొండారెడి సమగ్రంగా విచారిస్తున్నారు.   

ఒక్కరినైనా బతికించండి సారూ... 
నా మనవళ్లు, మనవరాలు ఎవరినో ఒకరినైనా బతికించండి సారూ.. అంటూ రిమ్స్‌ ఐపీ ప్రాంగణమంతా పిక్కటిల్లేలా చిన్నారుల నానమ్మ అయ్యవారమ్మ తీవ్ర స్థాయిలో రోదించింది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కడప డీఎస్పీ బూడిద సునీల్‌లు వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయగా ఆమె నా మనవళ్లు, మనవరాళ్లలో ఒక్కరినైనా బతికించండి సారూ.. అంటూ వేడుకోవడంతో అందరి హృదయాలు బరువెక్కాయి.  


చదవండి: మాల్యా, మోదీ, మెహుల్‌కు నిర్మలాజీ షాక్‌‌

దురదృష్టకర సంఘటన: 
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 
‘మిట్టమీదపల్లెలో సుబ్బనరసమ్మ అనే మహిళ తన భర్తతో గొడవపడి తాను పురుగుల మందుతాగి,  పిల్లలకు కూడా  తాపించడంతో వారు మరణించిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏవైనా మనస్పర్థలుంటే క్షణికావేశంతో ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇలాంటి విషాద సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు. ఏ కుటుంబం ఇలాంటి బాధను అనుభవించకూడదని దేవుడిని  వేడుకుంటున్నా’.. అని రిమ్స్‌లో మృతదేహాలను చూసిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అన్నారు.

పెద్దల సమక్షంలోనే సమస్యకు పరిష్కారం: కడప డీఎస్పీ బూడిద సునీల్‌ 
‘భార్యాభర్తల మధ్య సమస్యలుంటే పెద్దల సమక్షంలో లేక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేసి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరం. పిల్లల మృతదేహాలను చూసి కళ్లు చమర్చాయి. కుటుంబంలో ఎవరూ కూడా ఇలాంటి  సంఘటనలకు పాల్పడకూడదు.  పోలీసులను ఆశ్రయిస్తే సమస్యలను సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. ’ అని కడప డీఎస్పీ బూడిద సునీల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు