అమానుషం: కారుతో మూడుసార్లు తొక్కించి..

12 Feb, 2021 13:31 IST|Sakshi

కాకినాడ/కాకినాడ రూరల్‌:  తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన 9వ డివిజన్‌ వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ కంపర రమేష్‌ (47) గురువారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. వలసపాకల గంగరాజు నగర్‌లో సూర్య కార్‌ వాష్‌ వద్ద రమేష్ ను అతడి మిత్రుడే కారుతో ఢీకొట్టి హతమార్చాడు. సర్పవరం సీఐ నున్న రాజు కథనం ప్రకారం.. కార్పొరేటర్‌ రమేష్, స్నేహితులు ముత్యాల సతీష్, సుందరవీడి వాసు గురువారం రాత్రి 8 గంటలకు సూర్య కార్‌ వాష్‌ వద్ద పార్టీ చేసుకున్నారు. మరో స్నేహితుడైన గురజాన వీరవెంకట సత్యనారాయణ (చిన్నా) అనే వ్యక్తి ఐదు రోజులుగా తనను కలవాలంటూ మెసేజ్‌లు పెడుతున్నాడని, అందువల్ల అతణ్ణి కూడా పార్టీకి పిలుద్దామని కార్పొరేటర్‌ రమేష్‌ చెప్పగా.. మిగిలిన స్నేహితులు సరేనన్నారు. దీంతో రమేష్‌ చిన్నాకు ఫోన్‌ చేసి పార్టీకి రమ్మనడంతో అతడు తన సోదరుడు కుమార్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు.

అంతా కలిసి మద్యం సేవించిన అనంతరం చిన్నా తన సోదరుడి పుట్టిన రోజు కేక్‌ కటింగ్‌కు రావాలని రమేష్ ను కోరాడు. అందుకు రమేష్‌ నిరాకరించడంతో ఇద్దరిమధ్యా వాదులాట చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చిన్నా తన కారు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయగా.. రమేష్‌ అడ్డుపడ్డాడు. స్నేహితులు అతడిని పక్కకు తీసుకెళ్లగా.. తన కారు తాళం కనిపించడం లేదని, చిన్నా తీసుకుపోతున్నాడేమో అని రమేష్‌ మరోసారి కారుకు అడ్డుగా వెళ్లాడు. దాంతో చిన్నా తన కారుతో రమేష్ ను ఢీకొట్టాడు. కారు వేగానికి రమేష్‌ వలసపాకల మెయిన్‌ రోడ్డుపై పడిపోగా చిన్నా కారును రివర్స్‌ చేసి మరో రెండుసార్లు రమేష్ పైకి ఎక్కించి ముందుకు పోనిచ్చాడు. రక్తపుమడుగులో ఉన్న రమేష్ ను అతని స్నేహితులు సతీష్, వాసు సర్పవరం జంక్షన్‌ వద్ద గల ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 

నగరంలో విషాద ఛాయలు 
కార్పొరేటర్‌ కంపర రమేష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2000 సంవత్సరంలో తొలిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన కంపర రమేష్, 2001లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. తరువాత 2005లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. తిరిగి 2017లో వైఎస్సార్‌ సీపీ తరఫున 9వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. గతంలో వైఎస్సార్‌ సీపీ సిటీ కన్వీనర్‌గా, కాకినాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించారు. రమేష్‌ హత్యతో నగరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వివిధ రాజకీయ పారీ్టల నేతలు, అభిమానులు రమేష్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. 

పాతకక్షలే కారణం! 
రమేష్‌ హత్యకు గురైన దృశ్యాలు కార్‌ వాష్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. రమేష్‌ మీద నుంచి మూడుసార్లు కారును పోనివ్వడంతో కావాలనే చేశాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు పాతకక్షలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్టు సీఐ రాజు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు.  

చదవండి:
కాకినాడలో కార్పొరేటర్‌ దారుణ హత్య

నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్‌’ నిగ్గుతేల్చండి 

మరిన్ని వార్తలు