డిస్కౌంట్లో వాహనాలిప్పిస్తామని నమ్మించి రూ.10 కోట్లకు టోకరా!

8 Nov, 2021 13:15 IST|Sakshi
ఇటీవల ఓ ఖాతాదారుడిని నెలవారీ వాయిదాలు కట్టాలని చుట్టుముట్టిన ఫైనాన్స్‌ రికవరీ ఏజెంట్లు

కస్టమర్లకు వీఎస్‌వీపీ ప్రాజెక్ట్స్‌ టోకరా  తక్కువ ధరకే వాహనాలు 

ఇప్పిస్తామంటూ మోసాలు 

25శాతం డిస్కౌంట్‌ పేరిట 75శాతం కట్టించుకుని ఉడాయించిన వైనం 

వాహనాలు లాక్కెళుతున్న ఫైనాన్స్‌ కంపెనీలు 

లబోదిబోమంటున్న బాధితులు  రూ. 10 కోట్లకు పైగా టోకరా

VSVP Projects కామారెడ్డి క్రైం: తక్కువ ధరకే వాహనాలు ఇప్పిస్తామన్నారు.. భారీ డిస్కౌంట్‌ పేరిట ఎర వేశారు.. అమాయకుల ఆశను ఆసరాగా చేసుకుని జేబులు గుల్ల చేశారు. వందల మంది కస్టమర్లకు డిపాజిట్ల పేరిట కట్టించుకుని రూ. కోట్లల్లో టోకరా వేసి ఉడా యించిన వీఎస్‌వీపీ ప్రాజెక్ట్స్‌ కంపెనీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. డిపాజిట్‌గా కంపెనీలో జమ చేసిన డబ్బులు పోవడమే కాకుండా తీసుకున్న వాహనాలకు ప్రతినెలా చెల్లించాల్సిన ఫైనాన్స్‌ వాయిదాలు కస్టమర్ల నెత్తినపడ్డాయి. 

వాటిని చెల్లించలేక ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఆరు నెలల క్రితమే సదరు కంపెనీ దాదాపు రూ.10 కోట్లకు పైగా కస్టమర్లకు టోకరా వేసి బిచానా ఎత్తేసింది. అప్పటి నుంచి బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్ధితిలో పడ్డారు. తీసుకున్న వాహనాలకు ప్రతినెలా వాయిదాలు చెల్లించాలని ఫైనాన్స్‌ కంపెనీల ఒత్తిళ్లు పెరిగాయని వాపోతున్నారు. 

అసలేం జరిగిందంటే..
ఏడాదిన్నర క్రితం కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లిలో కొందరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వీఎస్‌వీపీ ప్రాజెక్ట్స్‌ పేరిట కంపెనీ బ్రాంచ్‌ను ప్రారంభించారు. కస్టమర్లను రాబట్టేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏజెంట్లను నియమించుకున్నారు. 25శాతం డిస్కౌంట్‌ మీద వాహనాలను ఇప్పిస్తామని నమ్మించారు. కస్టమర్ల వాటాను ముందుగా ఒకేసారి చెల్లించాలి. వాటిలో నుంచి కొంత మొత్తాన్ని షోరూంలో డౌన్‌ పేమెంట్‌ కింద చెల్లిస్తాం.. మిగతా మొత్తానికి ఫైనాన్స్‌ చేయిస్తామన్నారు. 

వీఎస్‌వీపీ కంపెనీ వద్ద మిగిలి ఉన్న కస్టమర్‌ డబ్బుకు ప్రతినెలా వడ్డీ కింద ఫైనాన్స్‌ వాయిదాలను మేమే చెల్లిస్తామని చెప్పారు. ఇక్కడే అసలు కిటుకు దాగి ఉంటుంది. ఫైనాన్స్‌ కస్లమర్‌ పేరుమీదే చేయించారు. ప్రతినెలా వీఎస్‌వీపీ కంపెనీ నుంచి కస్టమర్‌ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత ఫైనాన్స్‌ వాయిదాలకు కట్‌ అవుతాయని నమ్మించారు. ఫైనాన్స్‌ వాయిదాలకు ప్రతినెలా వీఎస్‌వీపీ నుంచి డబ్బులు మన అకౌంట్‌లోకి వస్తాయని కస్టమర్లు భావించారు. ముందుగా చెల్లించే తక్కువ ధరకే కొత్త వాహనం వస్తుంది కదా అని చాలామంది సభ్యులుగా చేరారు.

ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు, ఇలా అన్ని వాహనాలను డిస్కౌంట్‌ కింద ఇప్పిస్తామని నమ్మించి వందల సంఖ్యలో సభ్యులను చేర్చుకున్నారు. ప్రతి ఒక్కరి నుంచి వారు ఎంచుకున్న వాహనం ఖరీదులో నుంచి 75 శాతం మొత్తాన్ని ముందుగానే కట్టించుకుని వాహనాలు ఇప్పించారు. అందులో నుంచి కేవలం 10శాతం మాత్రమే డౌన్‌ పేమెంట్‌ కింద షోరూంలకు చెల్లించి మిగితావి ఫైనాన్స్‌ చేయించినట్లు తెలుస్తుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలలు అంతా బాగానే నడిచింది. ఆ తర్వాత కస్టమర్ల డిపాజిట్‌ డబ్బులను మాయం చేసి బోర్డు తిప్పేశారు. 

ఫైనాన్స్‌ కంపెనీల వేధింపులు 
వీఎస్‌వీపీ బోర్డు తిప్పేయడంతో కస్టమర్లు నిండా మునిగారు. ఇప్పుడిక తమ వాహనాలకు సంబంధించిన నెలవారీ ఫైనాన్స్‌ వాయిదాలు తామే చెల్లించుకోవాల్సిన పరిస్థితి కస్టమర్లకు ఎదురైంది. వాయిదాల డబ్బులు కట్టాలని ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారు, లేదంటే వాహనాలను లాక్కెళ్తున్నారని వాపోతున్నారు. ఫైనాన్స్‌ కంపెనీల వేధింపులు పెరగడంతో ఇప్పుడిప్పుడే మోసపోయామంటూ బాధితులు బయటకు వస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎవరైనా బాధితులు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

రూ. కోట్లలో టోకరా..
స్కీంలను, లాటరీలను, భారీ డిస్కౌంట్‌లను, మోసపూరిత కంపెనీలను నమ్మవద్దని ఎంత మొత్తుకున్నా కొందరు అత్యాశకు పోయి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వీఎస్‌వీపీ మోసాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. కంపెనీలో సభ్యులుగా చేరి, ద్విచక్ర వాహనాలు తీసుకుని మోసపోయిన వారు ఒక్క దేవునిపల్లి పరిధిలోనే దాదాపు 60 నుంచి 70 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు. దాదాపు రూ. 10 కోట్లకు పైగా దండుకుని కంపెనీ నిర్వాహకులు ఉడాయించినట్లు తెలుస్తోంది.

కంపెనీలో ఏజెంట్లుగా పనిచేసిన వారికి కష్టాలు తప్పడం లేదు. కొందరు ఏజెంట్లు, బాధితులు 5 నెలల క్రితం పట్టణ పోలీస్‌ స్టేషణ్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. దేవీవిహార్‌లో నివాసం ఉండే కంపెనీ నిర్వాహకుడు హైదరాబాద్‌కు పరారీ కాగా పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఆ వెంటనే బెయిల్‌ తెచ్చుకుని కేసు పెట్టిన వారికి డబ్బులు మాట్లాడుకుని సెటిల్‌మెంట్‌ చేసుకుట్లు తెలిసింది.  

రూ. 56 వేలు చెల్లించా
రూ. 56 వేలకే ఫ్యాషన్‌ప్రో బైక్‌ ఇస్తామన్నారు. దాంట్లో నుంచి రూ. 10 వేలు డౌన్‌పేమెంట్‌ కట్టి రూ. 71 వేలు నా పేరు మీద ఫైనాన్స్‌ చేయించారు. మిగతా డబ్బు కంపెనీ వద్ద డిపాజిట్‌గా ఉంటుందన్నారు. డిపాజిట్‌పై వడ్డీ కింద ఫైనాన్స్‌ వాయిదాల కోసం ప్రతినెలా నా అకౌంట్‌లో డబ్బులు జమచేస్తామన్నారు. రెండు నెలలు డబ్బులు వేశారు. ఆ తర్వాత కంపెనీ ఎత్తేశారు. అప్పటి నుంచి ప్రతినెలా ఫైనాన్స్‌ వాళ్లు వచ్చి వాయిదాలు కట్టాలని వేధిస్తున్నారు. నాలాంటి బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. – వెంకన్న, భవానీపేట్, లింగంపేట మండలం
 

మరిన్ని వార్తలు