పరువు నష్టం కేసులో రాయపాటి, కన్నా రాజీ

2 Nov, 2022 03:56 IST|Sakshi
కోర్టుకు హాజరైన కన్నా, రాయపాటి

గుంటూరు లీగల్‌: పరువు నష్టం కేసులో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్‌ నేత రాయపాటి సాంబశివరావులు రాజీ అయ్యారు. మంగళవారం నాలుగో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఇందుకు వేదికైంది. 2010లో రాయపాటి సాంబశివరావు పలు ఆరోపణలు చేస్తూ కన్నా లక్ష్మీనారాయణను విమర్శించారు.

అవి తన పరువుకు నష్టం కలిగించాయంటూ కన్నా కోర్టులో పరువు నష్టం దావా చేశారు. పరిహారంగా రూ.కోటి చెల్లించడంతోపాటు భవిష్యత్‌లో మళ్లీ ఏవిధమైన ఆరోపణలు చేయకుండా ఉండేలా పర్మినెంట్‌ ఇంజెంక్షన్‌ ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఇప్పటికే కన్నా తరఫున సాక్ష్యాలు కోర్టుకు సమర్పించగా.. ప్రస్తుతం రాయపాటి తరఫున సాక్ష్యాలు సమర్పించే దశలో కేసు కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో మంగళవారం జడ్జి ఇరు పార్టీలను మంగళవారం కోర్టుకు పిలిపించి, వారి న్యాయవాదుల సమక్షంలో రాజీ చర్చలు జరిపారు. తాను చేసిన ఆరోపణలను ఉపసహరించుకుంటున్నట్టు రాయపాటి చెప్పగా, దానికి కన్నా అంగీకరించారు. ఇరువర్గాల వారు స్నేహ పూర్వకంగా కేసు రాజీ పడేందుకు అంగీకరించి కోర్టులో ఉమ్మడి మెమో దాఖలు చేశారు. దీంతో కేసును కొట్టి వేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 

మరిన్ని వార్తలు