యూపీ కాన్పూర్‌లో ఘోరం.. దూసుకెళ్లిన ఈ-బస్సు, ఆరుగురి దుర్మరణం, విషమంగా తొమ్మిది మంది!

31 Jan, 2022 10:22 IST|Sakshi

Kanpur Bus Accident: ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి జనాల మీదకు దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 12 మందికి గాయాలు అయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. 


వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. జనాల మీదకు దూసుకెళ్లింది. ఆపై బస్సు ఓ ట్రాఫిక్‌ బూతును ఈడ్చుకుంటూ వెళ్లి.. ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కును ఢీ కొట్టి ఆగిపోయింది. ఘటన తర్వాత బస్సు డ్రైవర్‌ భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నట్లు ఈస్ట్‌ కాన్పూర్‌ డీఎస్పీ ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. క్షతగాత్రులకు దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు.. వాళ్లలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫేయిల్‌ అయినందునే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటన సమయంలో 20 మందికి పైగా గుంపు అక్కడ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.


ఇదిలా ఉండగా.. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు పొలిటీషియన్లు ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు