కాన్పూర్‌ హింస..800 మందిపై కేసులు

5 Jun, 2022 06:22 IST|Sakshi

24 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

కాన్పూర్‌/లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో శుక్రవారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు 800 మందికి పైగా కేసులు నమోదు చేశారు. వీరిలో 24 మందిని అరెస్ట్‌ చేసి, 12 మందిని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర వీడియో రికార్డింగ్‌ల ఆధారంగా హింసకు పాల్పడిన 36 మందిని గుర్తించామని కాన్పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీఎస్‌ మీనా వెల్లడించారు. బేకన్‌గంజ్‌ ఎస్‌హెచ్‌వో నవాబ్‌ అహ్మద్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అసిఫ్‌ రజా ఫిర్యాదుల వివిధ సెక్షన్ల కింద వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఘర్షణలకు సూత్రధారిగా అనుమానిస్తున్న మౌలానా మొహమ్మద్‌ అలీ(ఎంఎంఏ)జౌహార్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా గ్రూప్‌ చీఫ్‌ హయత్‌ జఫర్‌ హస్మితోపాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశామన్నారు.

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ)తదితర సంస్థలతో లింకులున్నట్లు తేలితే కఠినమైన జాతీయ భద్రతా చట్టంతోపాటు గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కమిషనర్‌ మీనా వెల్లడించారు. విదేశీ నిధులు అందాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కుట్రదారుల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. ఇటీవల ఓ టీవీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత నూపుర్‌ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం కాన్పూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొందరు దుకాణాలను మూసివేయించేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘర్షణల్లో 20 మంది పోలీసులు సహా మొత్తం 40 మంది గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు