‘కంటి వెలుగు డబ్బు’ కోసం వైద్యాధికారి కక్కుర్తి..

31 May, 2021 17:34 IST|Sakshi

టేకులపల్లి(ఖమ్మం): రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కంటి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగులో పనిచేసిన వైద్య సిబ్బందికి చెల్లించాల్సిన నగదు చెల్లించకుండా అప్పటి వైద్యాధికారి కంచర్ల రాజశేఖర్‌ నిబంధనలకు విరుద్ధంగా తన ఖాతాలోకి జమ చేసుకున్న ఘటన సులానగర్‌ పీహెచ్‌సీలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోనూ 2018 ఆగస్టు 15 నుంచి ఫిబ్రవరి 15 2019 వరకు కంటి పరీక్షల కేంద్రాలు నిర్వహించారు. ఇక్కడ పనిచేసిన సిబ్బందికి చెల్లించాల్సిన నగదును 2019 నవంబర్‌ 11న రూ.2.50 లక్షలను సులానగర్‌ పీహెచ్‌సీ ఖాతాలో జమ చేశారు. ఎన్నిసార్లు సిబ్బంది అడిగినా అప్పటి డీడీఓగా ఉన్న కంచర్ల రాజశేఖర్‌ చెల్లించలేదు. దీంతో తమకు రావాల్సిన కంటి వెలుగు డబ్బులు ఇప్పించాలని కోరుతూ అప్పటి వైద్యాధికారి, జిల్లా మాతా శిశు ప్రోగ్రాం ఆఫీసర్‌ జె.శ్రీనునాయక్‌కు బాధితులు దేవా, శ్రీనివాసరావు, ఉమేశ్, మానస, స్రవంతి, వెంకటరమణ, కృష్ణవేణి గతేడాది ఫిబ్రవరి 24న ఫిర్యాదు చేశారు. 

గోల్‌మాల్‌.. 
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్‌ రాజశేఖర్‌ కంటి వెలుగు నగదును తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే 13.11.2019 నాడు వైద్య శాఖ రూ.2.50 లక్షలు పీహెచ్‌సీ ఖాతాలో జమ చేసింది. 14.11.2019 నాడు సదరు డాక్టర్‌ చెక్‌ నంబర్‌ 785013 ద్వారా రూ.1,35,000 తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. 

ఆ తరువాత 30.12.2019 నాడు చెక్‌ నంబర్‌ 785014 ద్వారా రూ.1,14,500 డ్రా చేసుకున్నాడు. మొత్తం రూ.2,49,500 గోల్‌మాల్‌ అయ్యాయి. నిబంధనల ప్రకారం ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాంకు సంబంధించిన నగదును సిబ్బంది ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకుండా సదరు డాక్టర్‌ మొత్తం నగదు తన ఖాతాలోకి జమ చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు డాక్టర్‌ రాజశేఖర్‌కు ఫోన్‌ చేయగా ఆయన్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

మరిన్ని వార్తలు