ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి..

6 Apr, 2021 09:22 IST|Sakshi
మణిదీప్‌ (ఫైల్‌), పరిస్థితి విషమంగా ఉన్న విష్ణు, నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం  

మరొకరి పరిస్థితి విషమం

నగునూర్‌ రైతు వేదిక వద్ద ఘటన

చెగ్యాంలో విషాదం

సాక్షి, కరీంనగర్‌ : కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వెల్గటూరు మండలంలోని చెగ్యాంలో విషాదం నింపింది. కరీంనగర్‌ రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం.. చెగ్యాంకు చెందిన పన్నాల చిలుకయ్య–సునీత దంపతుల కుమారుడు మణిదీప్‌(17), పన్నాల పోషయ్య–సత్తవ్వ దంపతుల కుమారుడు విష్ణు వరసకు అన్నదమ్ములు. మణిదీప్‌ గతేడాది పదో తరగతి పూర్తి చేయగా విష్ణు పదో తరగతి చదువుతున్నాడు. ఎటువెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ఇటీవల తల్లిదండ్రులను బెదిరించి మరీ బైక్‌లు కొనుక్కున్నారు.

ఈ క్రమంలో మణిదీప్‌ తన బైక్‌ సర్వీసింగ్‌ కోసం కరీంనగర్‌ వెళ్దామని విష్ణుని అడిగాడు. ఇద్దరూ కలిసి సోమవారం ఉదయం బైక్‌పై కరీంనగర్‌ వెళ్లారు. సర్వీసింగ్‌ పూర్తయ్యాక మధ్యాహ్నం స్వగ్రామం బయలుదేరారు. నగునూర్‌ రైతు వేదిక వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదురుగా వస్తున్న కారును అతివేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరూ దూరంగా ఎగిరిపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మణిదీప్‌ మృతిచెందాడు. విష్ణును ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నాడు.

పోషయ్య–సత్తవ్వ దంపతులకు విష్ణు ఒక్కడే సంతానం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాలకు వ్యవసాయమే ఆధారమని గ్రామస్తులు తెలిపారు. మణిదీప్, విష్ణులకు బైక్‌ రేస్‌లంటే ఇష్టమని, ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మణిదీప్‌ చనిపోగా విష్ణు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో బాధిత కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మృతుడి తండ్రి చిలుకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, హెల్మెట్‌ ఉంటే ఇంత నష్టం జరిగి ఉండకపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్‌ విద్యార్థి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు