వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే..

13 Jun, 2022 10:31 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌క్రైం: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కరీంనగర్‌లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ పట్టణంలోని భగత్‌నగర్‌కు చెందిన తాండ్ర పాపారావు–పద్మల కుమారుడు ప్రణీత్‌కు నిజామాబాద్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఈ దంపతులు అమెరికాలో ఉంటున్నారు. వీరికి నాలుగు నెలల క్రితం బాబు జన్మించాడు. అప్పటినుంచి తమ మనవడిని చూడాలని పాపారావు–పద్మ ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో వీసా పనిమీద ఆదివారం కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. కానీ విధి వక్రీకరించడంతో మల్లారం వద్ద డివైడర్‌ పైకి దూసుకెళ్లిన ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనతో మనవడిని నేరుగా చూడకుండానే మృత్యుఒడికి చేరుకున్నారు. వీరితోపాటు కారు డ్రైవర్‌ గుంటి ఆంజనేయులు కూడా మృతిచెందాడు. 

ఎంతో మంది విద్యార్థులకు మార్గనిర్దేశకుడు..
కామర్స్‌ అధ్యాపకుడైన పాపారావు తొలుత నిర్మల్‌లో జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత కరీంనగర్‌ ఆర్ట్స్‌ కళాశాల, జగిత్యాల ఉమెన్స్‌ కళాశాలలో డిగ్రీ లెక్చరర్‌గా, అగ్రహారంలో, చివరకు కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలల్లో బోధించాడు. ఒక ఏడాదిపాటు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా పని చేశారు. 2016లో ప్రభుత్వ ఉమెన్స్‌ కళాశాలలో ఉద్యోగ విరమణ పొందాడు. వేలాది మంది విద్యార్థులకు పాఠాలు బోధించి, వారికి మార్గనిర్దేశకుడిగా మారారు. 

పాపారావు భార్య పద్మ ఆరేళ్ల క్రితం ల్యుకేమియా వ్యాధితో ఏడాదిపాటు పోరాడి, కోలుకున్నారు. అప్పుడు అండతో మృత్యువును గెలిచినా ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దంపతులిద్దరూ ఇద్దరు వైష్ణవ భక్తులు. వీరు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు. పాపారావు కుమారుడు ప్రణీత్‌ అమెరికా నుంచి బయలుదేరాడు. సోమవారం రాత్రి వరకు ఇంటికి చేరనున్నాడు. మంగళవారం తల్లిదండ్రుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. 
చదవండి: జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్‌కు

ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్‌ ఆంజనేయులుది నాగుల మల్యాల స్వగ్రామం. సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆంజనేయులు గతంలో చాలాసార్లు పాపారావును ట్యాక్సీలో తీసుకెళ్లినట్లు  సమాచారం. 

మరిన్ని వార్తలు