ఎంసెట్ స్టేట్‌ ర్యాంకర్ ప్రాణం తీసిన లోన్ యాప్ వేధింపులు

24 Sep, 2022 15:15 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: లోన్‌ యాప్స్‌ నిర్వాహకుల ఆగడాలకు అడ్డులేకపోతుంది. రోజురోజుకీ వీటి ఆకృత్యాలు ఎక్కువైపోతున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితం లోన్‌ యాప్స్‌ మోసాలకు అర్దాంతరంగా ముగిసిపోతోంది. తాజాగా లోన్‌ యాప్‌ వేధింపులు మరో యువకుడి ప్రాణం తీశాయి. కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీధర్‌-పధ్మ దంపతుల కుమారుడు మని సాయి. ఇటీవల విడుదలైన ఎంసెట్ ఫలితాలలో 2వేల ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్‌లోని స్నేహితుడి రూమ్‌కు వచ్చి కౌన్సిలింగ్‌కు సిద్ధమవుతున్నాడు. అంతకుముందే డబ్బులు అవసరం ఉండి లోన్‌ యాప్‌లో రూ. 6 వేలు అప్పుగా తీసుకున్నాడు. గత ఆరు నెలలుగా రూ. 45 వేలు కట్టినా.. నిర్వహాకుల వేధింపులు మాత్రం ఆగడం లేదు.

దీంతో లోన్‌ యాప్‌ వేధింపులు తట్టుకోలేక ఈనెల 20న శంషాబాద్‌లోని తన రూమ్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని గమనించిన స్నేహితులు ఆసుపత్రికి తరలించడగా.. చికిత్స పొందుతూ మణి సాయి శుక్రవారం మృతి చెందాడు. మునిసాయి వైద్యం కోసం తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణం దక్కలేదు. ఎంసెట్‌లో స్టేట్‌ ర్యాంక్‌ సాధించిన మనిసాయి వెబ్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్‌ల వలలో చిక్కి ప్రాణాలు కోల్పోవడంతో యువకుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చదవండి: డ్రైవర్‌ను చితక్కొట్టిన కానిస్టేబుల్‌.. కొట్టింది నిజమేనన్న ఇన్‌స్పెక్టర్‌

మరిన్ని వార్తలు