Karimnagar Crime News: నాన్నా.. అమ్మ, తాతను చంపొద్దు

20 Jul, 2021 10:09 IST|Sakshi

చిన్నారులు వేడుకున్నా...కరగని మనసు

సోదరుడితో కలసి భార్య, మామను హతమార్చిన యువకుడు

కౌన్సెలింగ్‌ కోసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా దారుణం

మానకొండూర్‌: కుటుంబ కలహాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అమ్మను, తాతను చంపొద్దని చిన్నారులు వేడుకున్నా..నాన్న, చిన్నాన్నల మనసు కరగలేదు. పోలీసుల కౌన్సెలింగ్‌ అనంతరం ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో భార్యను, మామను అల్లుడు, అతడి సోదరుడు దారుణంగా హత్య చేశారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలంలోని శ్రీనివాస్‌నగర్‌ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

మానకొండూర్‌ మండలం వెల్ది గ్రామానికి చెందిన లావణ్య(34)కు ఇదే మండలం అన్నారం గ్రామానికి చెందిన రమేశ్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రమేశ్‌ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దంపతులకు అజిత్, అక్షిత సంతానం. ఈ నేపథ్యంలో భార్యపై రమేశ్‌ అనుమానం పెంచుకోగా, మనస్పర్థలు వచ్చి కొద్దిరోజులుగా ఇద్దరికీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. లావణ్య పిల్లలతో కలసి తల్లి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం కరీంనగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో దంపతులకు కౌన్సెలింగ్‌ చేసి, మళ్లీ రెండ్రోజులకు రావాలని సూచించారు.

దీంతో లావణ్య, పిల్లలతోపాటు తండ్రి బాలసాని ఓదెలు(60) ఆటోలో వెల్దికి బయల్దేరారు. మార్గమధ్యంలోని శ్రీనివాస్‌నగర్‌ గ్రామ శివారులో బైక్‌పై వచ్చిన రమేశ్‌ అతడి తమ్ముడు అనిల్‌ ఆటోను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. కత్తితో లావణ్య, ఓదెలు గొంతు కోసి వెళ్లిపోయారు. అడ్డగించిన చిన్నారులకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 

మరిన్ని వార్తలు