టెక్కీ దంపతులు.. 3 నెలలకే విడాకుల వరకు.. ఎందుకిలా జరుగుతోంది?

23 Nov, 2021 13:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిన్నచిన్న కారణాలతో ఠాణా మెట్లెక్కుతున్న వైనం

క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం

 మూడుముళ్ల బంధాన్ని తెంచుకునేందుకు  సిద్ధపడుతున్న కొత్త జంటలు

కూర్చొని మాట్లాడుకోవాలంటున్న పోలీసులు

‘మనస్పర్థలు వచ్చి, ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఇటీవల కరీంనగర్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ సమీపానికి వచ్చి, పురుగు మందుతాగే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.’

‘కరీంనగర్‌ పట్టణానికి చెందిన దంపతులకు వివాహమై మూడు నెలలు మాత్రమే అయింది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. ఒకరోజు భర్త ఓ విషయంలో గొడవపడి భార్యను ‘పో’ అన్నాడు. నన్ను పో అంటావా అని ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాదిపాటు ఒకరినొకరు పలకరించుకోలేదు. చివరకు విడాకులు కావాలని పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసు అధికారికి పై కారణం చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇంత చిన్న విషయానికి విడాకుల వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని తలపట్టుకున్నాడు.’ఇలాంటి కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకునే వరకు వెళ్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.’

సాక్షి, కరీంనగర్‌: కడదాకా ఒకరికొకరం తోడుంటామని చేసుకున్న బాసలు నీటిమీద రాతలవుతున్నాయి.. ఏడడుగులు నడిచి, మూడుముళ్ల బంధంతో ఒక్కటైన వారు నెలలు తిరగకుండానే మనస్పర్థలతో పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దంపతులు పరస్పరం కేసులు పెట్టుకుంటూ తామన్నది సాగకపోతే ఠాణాల్లోనే  ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు. కరీంనగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కూర్చొని మాట్లాడుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, అప్పటికీ కలిసి ఉండటం కష్టం అనుకుంటే చట్టప్రకారం విడాకులు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆత్మహత్యాయత్నాలు, బ్లాక్‌ మెయిల్‌ ద్వారా కాపురాలు నిలబడవని అంటున్నారు.

బ్లాక్‌మెయిల్‌తో  కాపురాలు సాగవు
దంపతులిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినప్పుడు కూర్చొని, మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఠాణాల వద్ద ఆత్మహత్యకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవు. ఎదుటివారిని లొంగదీసుకోవాలని భావించి, బ్లాక్‌మెయిల్‌ చేస్తే కాపురాలు సాగవు.
– తుల శ్రీనివాసరావు, కరీంనగర్‌టౌన్‌ ఏసీపీ 

ఆవేశంలో నిర్ణయాలు..
చాలామంది చిన్నచిన్న గొడవలను పెద్దవిగా చేసి, తమ కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. చీటికీమాటికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కౌన్సెలింగ్‌లో ఎంతచెప్పినా అర్థం చేసుకోకుండా తాము అనుకున్నదే సాగాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగడం ఈ మధ్య పరిపాటిగా  గొడవ చిన్నదిగా ఉన్నప్పుడే దంపతులు కూర్చొని, మాట్లాడుకోవాలని, లేదంటే ఇరుకుటుంబాల వారు పరిష్కారం చూపాలని పోలీసులు చెబుతున్నారు.  

పలుమార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండగా కొందరు మారుతున్నారని, మరికొందరు మాత్రం ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ కాపురాలను నాశనం చేసుకుంటున్నారని అంటున్నారు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరి అజమాయిషీ కోసం తాపత్రయపడటం, అహంభావంతో ఒకరినొకరు గౌరవించుకోలేకపోవడం, వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలది తప్పయినా వారినే సమర్థించడంతో చిన్న గొడవలు పెద్దవై, విడాకులకు దారి తీస్తున్నాయని పేర్కొంటున్నారు. 

బెదిరింపులకు దిగితే చర్యలు..
సమస్యలపై ఠాణాలకు పిలిపించినప్పుడు బెదిరింపులకు దిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్‌మెయిల్‌ చేయడం ద్వారా ఒకరినొకరు లొంగదీసుకోవచ్చనే ఆలోచనలు మానుకోవాలని అంటున్నారు. కలిసి బతకడం కుదరకపోతే  కోర్టు ద్వారా విడాకులు పొందాలని చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు