మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో..

7 Apr, 2022 08:42 IST|Sakshi

48గంటల్లో కటకటాల పాలు

వివరాలు వెల్లడించిన సీఐ నారాయణ్‌నాయక్‌ 

సాక్షి,మంచిర్యాలక్రైం: ఎవరికంట పడకుండా, దొంగతనం చేసి డబ్బులు సంపాధించుకుందామనుకున్న ఓ ముగ్గురు, ముఠాగా ఏర్పడి దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు. దొంగతనం చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం, పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనాన్ని అమ్మేందుకు వెళ్తూ దొరికిపోయారు. స్థానిక సీఐ నారాయణ్‌నాయక్‌ ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాతమంచిర్యాలకు చెందిన వీర్ల శ్రీనివాస్‌కు చెందిన ఎమ్‌హెచ్‌ 40 ఎల్‌ 3165 నంబర్‌ గల ట్రాక్టర్‌ ఈ నెల 3న తెల్లవారుజామున దొంగతనానికి గురైందని పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

దీంతో కేసు నమోదు చేసుకొని ప్రత్యేక పోలీస్‌ బృందంతో తనిఖీలు చేశాం. దొంగతనం చేసిన తీరు కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 3వ తేదీన దొంగతనానికి పాల్పడి ట్రాక్టర్‌ను కాలేజీ రోడ్డులోని ముళ్లపొదల్లో దాచిపెట్టారు. ట్రాక్టర్‌ను తిరిగి బుధవారం అమ్మేందుకు వెళ్తుండగా, ఫ్‌లై ఓవర్‌బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖి చేస్తుండగా చూసి బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అనుమానించి పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ట్రాక్టర్‌ను గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసిన తీరును ఒప్పుకున్నారు. ఈ మేరకు రూ. 3లక్షల విలువ గల ట్రాక్టర్‌ను, వారి వద్ద నుంచి రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు దొంగలను రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. 

మొదటి సారి దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయి..
మొదటిసారి దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన దొంగల ముఠాలో ములుగు జిల్లా లక్ష్మిదేవిపేటకు చెందిన సెగ్గం రాజతిరుపతి, సెగ్గం లచ్చులు, భూపాలపల్లి జిల్లా దేవరాంపల్లి గ్రామానికి చెందిన బోర్లకుంట ప్రకాష్‌ ఈజీగా మనీ సంపాదించాల నే దురాలోచనతో మొదటి దొంగతనానికి అలవా టుపడి దొరికిపోయి కటకటాలపాలయ్యారు.

48గంటల్లో కేసు చేధించిన పోలీసులు..
ట్రాక్టర్‌ దొంగతనానికి గురైన 48గంటల్లో మంచిర్యా ల పోలీసులు చేధించడంతో ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నారాయణ్‌నాయక్, ఎస్సై హరిశేఖర్, స్పెషల్‌ పార్టీ పోలీసులు దివాకర్, రాము, మహేష్‌బాబు, శ్రీనివాస్‌లను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీపీ అఖిల్‌మహాజన్, ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ అభినందించారు.

చదవండి: రెండేళ్ల ప్రేమ.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో..

మరిన్ని వార్తలు