బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్‌లైన్‌లో రమ్మీ ఆట.. రూ.2.36కోట్లు స్వాహా..!

28 Feb, 2023 16:19 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్‌లైన్‌లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్‌ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
వీరేశ్ కేషిమఠ్‌(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో గ్యాంబ్లింగ్ గేమ్స్‌ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్‌కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్‍లైన్‌ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు.

అయితే ఇటీవల ఈ బ్రాంచ్‌లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది  ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు  తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు.
చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్‌, హాంకాంగ్‌లో శిక్షణ..

మరిన్ని వార్తలు