పెళ్లి చూసుకుని తిరిగి వస్తుండగా.. ప్రాణాలు తీసిన ఓవర్‌టేక్‌ 

21 Nov, 2021 09:46 IST|Sakshi

చెట్టును ఢీకొన్న కారు, ఇద్దరు మృతి 

కెలమంగలం: బెంగళూరులో పెళ్లి చూసుకుని కారులో స్వగ్రామానికొస్తూ చెట్టును ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాలు.. శుక్రవారం రాత్రి డెంకణీకోటకు చెందిన మంజునాథ్‌ (22), మిత్రులు వేదాంత (21), భరత్‌ (21), లోకనాథన్‌ (22)లు కలిసి బెంగళూరులో ఒక పెళ్లికి హాజరై తిరుగుముఖం పట్టారు. హోసూరు– డెంకణీకోట రోడ్డులోని తండ్రి గ్రామం వద్ద ఒక వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

తీవ్రగాయాలతో మంజునాథ్, భరత్‌లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వేదాంత, లోకనాథన్‌ల పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గాయపడిన వారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు  చేసుకొని విచారణ జరుపుతున్నారు.   
చెరువులోకి కారు పల్టీ

ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు  
యశవంతపుర: కారు అదుపుతప్పి చెరువులో పడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన బెంగళూరు కగ్గలిపుర పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. ఐదు మంది స్నేహితులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో డాబాలో భోజనం చేసి కగ్గలిపుర చెరువుకట్టపై నగరానికి తిరిగి వస్తున్నారు. కనకపుర రోడ్డు సోమనహళ్లి చెరువు కట్టపై అతివేగంలో అదుపుతప్పి చెరువులోకి బోల్తా పడింది.  పుండలీక(30), కల్లేశ్‌ (33) అనే ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇద్దరు ఈదుకుంటూ బయటకు వచ్చారు. మరొకరి జాడ తెలియరాలేదు. మృతులు హుబ్లీ, హావేరికి చెందినవారని తెలిసింది. నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. వీకెండ్‌ కావడంతో షికారుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు.  
 

మరిన్ని వార్తలు