రాసలీలల కేసు: యువతి చిన్నప్పటి విషయాలపై ఆరా

24 Mar, 2021 02:18 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల కేసు దర్యాప్తు ఒక పట్టాన గాడిలో పడడం లేదు. మార్చి 2న విడుదలైన రాసలీలల సీడీలో కనిపించిన యువతి కోసం నాటి నుంచి సిట్‌ పోలీసులు ముమ్మరంగా వెతుకుతున్నా ఫలితం లేదు. మరోవైపు ఆమె తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. యువతి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలపై ఆరా తీశారు. బాధిత యువతి విద్యాభ్యాసం, స్నేహితులు తదితర వివరాలను సేకరించారు.

కాగా, యువతి పరారయ్యాక ఇప్పటికి నాలుగు సార్లు ఫోన్‌ చేసిందని, గోవా, బెంగళూరు, చెన్నైకి వెళ్లినప్పుడు కాల్‌ చేసిందని తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిసింది. సురక్షితంగా ఉన్నానని ఒకసారి చెప్పిందని, కానీ చెన్నైకి వెళ్లిన తర్వాత భయంతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. చివరి సారి ఫోన్‌ చేసినప్పుడు తనను బలవంతంగా పట్టుకొచ్చారని, పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని, పూర్తి ఒత్తిడిలో ఉన్నానని కూతురు చెప్పిందని వివరించారు. సీడీ కేసులో కీలక సూత్రధారులుగా ఉన్న నిందితులు భోపాల్‌లో మకాం వేసినట్లు సిట్‌కు సమాచారం అందింది.  

హోంమంత్రితో సిట్‌ భేటీ..
మంగళవారం సిట్‌ అధికారులు విధానసౌధకు వెళ్లి సీఎం యడియూరప్ప, హోం మంత్రి బసవరాజు బొమ్మైని కలిసి కేసు విచారణ గురించి వివరించారు. సీడీ కేసులో అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు సిట్‌ అధికారులను పిలిపించినట్లు తెలిసింది. 

చదవండి: (సీడీ ముఠా ఎక్కడ.. వారికి డబ్బులెలా వస్తున్నాయి?!)

>
మరిన్ని వార్తలు