విమానాల్లో వచ్చి దర్జాగా చోరీలు.. పట్టుబడ్డ యూపీ దొంగలు

28 Jul, 2021 21:24 IST|Sakshi

బెంగళూరు: విమానాల్లో వచ్చి చోరీలు చేసి రైళ్లలో పరారవుతున్న ఇద్దరు ఖతర్నాక్‌ దొంగలను యూపీలో కర్ణాటక పోలీసులు అరెస్ట్‌ చేశారు. అర్జున్‌సింగ్‌ (27), సోనుకుమార్‌ (32)లు గతనెల 30న బెంగళూరు గ్రామీణ జిల్లాలో 19 చోట్ల చైన్‌ స్నాచింగ్‌లు చేశారు. అనంతరం సర్జాపురలో స్నేహితుడి గదికి వెళ్లారు. ఇలా ఒకే రోజు పెద్ద ఎత్తున స్నాచింగ్‌లు జరగడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కేసులు నమోదు చేసుకుని, నిందితులను సర్జాపురలోని తన గదిలో ఉంచుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తిరిగి చివరకు యూపీలో నిందితులను అరెస్టు చేసారు.

ఇంట్లో వారందరినీ కట్టేసి
మైసూరు: ఇంట్లో వారందరినీ కట్టేసి నగదు, నగలు దోచుకుని పరారైన ఘటన జిల్లాలోని హణసూరు పట్టణంలో జరిగింది. పట్టణంలోని సుమన్‌ ఫంక్షన్‌ హాల్‌ యజమాని ఇంటికి సోమవారం అర్ధరాత్రి దుండగులు ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను మారణాయుధాలతో బెదిరించి దాడి చేసి కట్టేశారు. అనంతరం ఇంట్లోని రూ. 6 లక్షల నగదు, అరకేజీ బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. దొంగల దాడిలో గాయపడిన నస్రత్‌ ఉన్నిసా, మమ్తాజ్, ఆయేషా అంజుం, గజాలత్‌ తరనంలను ఆస్పత్రికి తరలించారు.

భార్య పుట్టింటికి వెళ్లిందని...
దొడ్డబళ్లాపురం: గొడవపడ్డ భార్య పుట్టింటికి వెళ్లడంతో కలతచెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా దాబస్‌పేట పట్టణంలో చోటుచేసుకుంది. దాబస్‌పేట శివగంగ సర్కిల్‌లో నివసిస్తున్న శివరామ్‌ (42) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. శివరామ్‌ భార్య వారం క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరామ్‌ మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా శివరామ్‌ మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. మూడు రోజుల క్రితమే ఆత్మçహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.   

మరిన్ని వార్తలు