కరోనా పేరుతో ఆన్‌లైన్‌ మోసగాళ్ల దందా

25 May, 2021 10:23 IST|Sakshi

టీకాలు, ఔషధాల అమ్మకాలని ఖాతాలు ఖాళీ

బనశంకరి: కరోనా వైరస్‌ చాటున సైబర్‌ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారు. కోవిడ్‌ టీకా, ఔషధాల పేరుతో ఆధార్‌ నంబరు, ఓటీపీ తీసుకుని వారి అకౌంట్లు నుంచి లక్షలాది రూపాయలు కాజేస్తున్న ముఠాలు పెరిగాయి. మోసగాళ్లు ప్రజల పోన్‌ నంబర్లును సేకరించి కాల్‌ చేస్తారు. మీరు టీకా వేసుకున్నారా అంటూ కోవిడ్‌ వారియర్లుగా మాటలు కలుపుతారు. టీకా కోసం మీ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని ఆధార్, బ్యాంకు ఖాతాలు, ఫోన్‌పే తదితరాల వివరాలు తీసుకుంటారు. ఓటీపీ నంబరు వస్తుంది, మాకు చెప్పండి అని నమ్మించి అందినంత స్వాహా చేయడం పెరిగింది. వంచకులు ఎక్కువగా వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్నారు. బెంగళూరులో ఈ తరహా కేసులు కొన్నినెలలుగా పెరగడమే తప్ప తగ్గడం లేదు.

వేలిముద్ర వేశారో అంతే ..
ఆక్సిజన్, బీపీ, షుగర్‌ పరీక్షలు చేసే యాప్‌ల గురించి ప్రకటనలు సోషల్‌ మీడియాలో వంచకులు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ యాప్‌లను ఉపయోగిస్తే అందులో వేలిముద్ర వేయమంటారు. అలా వేలిముద్రలు తస్కరించి ఆధార్‌లింక్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్‌ సమాచారంతో నగదు కాజేస్తారు.

రోజుకు 10కిపైగా కేసులు..  
జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల గ్యాంగ్‌లు ఈ కోవిడ్‌ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. కోవిడ్‌ చికిత్సలు, వస్తువుల విక్రయాల పేరుతో రోజూ 10కి పైగా నగదు చోరీ కేసులు బెంగళూరులో నమోదవుతున్నాయి. బాధితులు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయడం నిత్యకృత్యమైంది.

నగదు పంపగానే స్విచ్చాఫ్‌  

  • బెంగళూరు భూపసంద్రకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఆక్సిజన్‌ ఉపకరణాలు, వెంటిలేటర్‌ కోసం ఇంటర్నెట్లో శోధించగా, ఒక కంపెనీ ప్రకటనను చూసి ఫోన్లో ప్రతినిధిని సంప్రదించాడు. ఆ వస్తుసామగ్రిని తాము సరఫరా చేస్తామని చెప్పి రూ.12.59 లక్షలు బదిలీ చేయించుకుని ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నారు.  
  • బెంగళూరు శ్రీనగరలో మెడికల్‌ డి్రస్టిబ్యూటర్‌  రెమ్‌డెసివిర్‌ టీకాల కోసం ఇంటర్నెట్లో గాలించాడు. మారతహళ్లిలో సరఫరా ఏజెన్సీ ఉందని మోసగాళ్లు కాల్‌ చేసి రూ. 5లక్షలు ఆన్‌లైన్లో బదిలీ చేయించుకుని అడ్రస్‌ లేకుండా పోయారు.
మరిన్ని వార్తలు